టీయూ రిజిస్ట్రార్​ పోస్ట్​పై హైడ్రామా

  • పొద్దున్నే  ఆర్డర్​ కాపీతో  వచ్చిన ఓయూ ఫ్రొఫెసర్​ నిర్మలాదేవి
  • మధ్యాహ్నానికి పోస్టింగ్​ రద్దు  చేస్తూ ఓయూ నుంచి ఉత్తర్వులు
  • రద్దు విషయం పై స్పందించని నిర్మలాదేవి

నిజామాబాద్​, వెలుగు: తెలంగాణ వర్సిటీ రిజిస్ట్రార్ నియామకంలో హైడ్రామా కొనసాగుతోంది. ఓయూకు చెందిన  ప్రొఫెసర్​ నిర్మలాదేవీ బుధవారం రిజిస్ట్రార్​గా బాధ్యతలు తీసుకున్నారు. ఉదయం ఆమె నియామక ఉత్వర్వు లతో టీయూకు రాగా.. మధ్యాహ్నానికి పోస్టింగ్​ రద్దు చేస్తూ ఓయూ నుంచి మరో ఆర్డర్​   విడుదలైంది.  ఈ ఆర్డర్స్​పై ఆమె మౌనంగా ఉన్నారు.  మీడియా అడిగిన ప్రశ్నలకు రద్దు ఉత్తర్వులు తమకు  తెలియదని దాటవేశారు.  తాను ఓయూ నుంచి రిలీవ్ అయి,  టీయూలో ఛార్జి తీసుకున్నానని, ఇక్కడే కంటిన్యూ అవుతానని  స్పష్టం చేశారు.  రిజిస్ట్రార్​ హోదాలో విద్యావర్థిని నుంచి బాధ్యతలు  తీసుకున్నట్టు   లేఖపై  సంతకం చేశారు. వీసీ వర్సెస్​ ఈసీ ఇదిలా ఉండగా.. టీయూలో వీసీ రవీందర్​​గుప్తా ఈసీ సభ్యుల మధ్య కోల్డ్​వార్​ నడుస్తోంది. 19న  హైదరాబాద్​లో ఉన్నత విద్యాశాఖ కమిషనర్​ నవీన్​మిట్టల్, కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో మీటింగ్​  జరిగింది.  దీని తర్వాత  పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  ఆ మీటింగ్​ నిర్ణయం తో ప్రొఫెసర్​ యాదగిరి రిజిస్ట్రార్​ బాధ్యతలు తీసుకోగా హైకోర్డు స్టే ఆర్డర్​తో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. స్టే రద్దు కోసం కోర్టులో ఇప్పటికే  కౌంటర్​ దాఖాలు చేశారు. రిజిస్ట్రార్​ గా పని చేయడానికి  విద్యావర్థిని   ఆసక్తిగా లేకపోవడంతో ఉత్కంఠకు దారితీసింది.  

పై అధికారులు  సీరియస్​ 

పై అధికారులకు తెలియకుండా నిర్మలాదేవీ నియామకం జరిగినట్టు తెలుస్తోంది.  ఓయూ నుంచి రిలీవ్​ ఉత్తర్వులతో   ఆమె హుటాహుటినా టీయూకి చేరుకున్నారు.  ఈ టైం లోనే పోస్టింగ్​ రద్దు ఉత్తర్వులు వెలువడ్డాయి. నిర్మలాదేవీ నియామకాన్ని రద్దు చేస్తూ.. తక్షణమే ఓయూలో రిపోర్టు చేయాలని అక్కడి రిజిస్ట్రార్​ లక్ష్మీనారాయణ ఆర్డర్​ జారీ చేశారు. సదరు ఆర్డర్​ను ఆమెకు, వీసీ రవీందర్ గుప్తాకు వాట్సాప్​లో పంపించినట్టు సమాచారం. అయితే అనూహ్య రీతిలో ఆమె అక్కడి బాధ్యతలు స్వీకరించి వెళ్లడం గమనార్హం. ఆర్డర్ రద్దు అయినట్టు తెలిసినా  నిర్మలాదేవీ ఛార్జి తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఓయూ నుంచి ఆమె అధికారికంగా రిలీవ్​ అయి కొత్త బాధ్యతల్లో చేరారని వీసీ రవీందర్​ చెప్పారు. వీసీ  రవీందర్  హయాంలో ఇప్పటికే  ఐదుగురు రిజిస్ట్రార్​లు మారారు. వీరిలో యాదగిరి ఒక్కరికి మాత్రమే ఈసీ సభ్యుల ఆమోదం ఉంది.  తాజాగా వీసీ అధికారాలతో నిర్మలాదేవిని నియమించినా మూడు నెలల వ్యవధిలో దానిని ఈసీ సభ్యులు ఓకే చేయాల్సి ఉంటుంది.