- హైకోర్టుకు వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లు
- కూల్చివేతలు ఆపాలంటూ పిటిషన్
- విచారణకు స్వీకరించిన న్యాయస్థానం
- తమ పరిధిలోకి రాదంటున్న రంగనాథ్
- 111 జీవో, నార్సింగ్ మున్సిపాలిటీ లిమిట్స్ అని క్లారిటీ
హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్ పై హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫాంహౌస్ లో నివాసం ఉంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం జన్వాడలో ఈ ఫాంహౌస్ ను 2014లో నిర్మించారని, 2019లో తాను యూ అండ్ డీ సంస్థ నుంచి కొనుగోలు చేశానని, ఎలాంటి అక్రమాలు జరగలేదని, హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయాలని చూస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకుడు ప్రదీప్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. చెరువునకు 30 మీటర్ల దూరంలో నిర్మాణం చేపట్టామని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఫాంహౌస్ కు కూల్చివేతలు చేపడుతోందని, తమ ఫాంహౌస్ కు రక్షణ కల్పించాలని కోరారు.
మా పరిధిలోకే రాదు: రంగనాథ్
జన్వాడపై దాఖలైన పిటిషన్ తమ పరిధిలోకి రాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెబుతున్నారు జన్వాడ ఫాంహౌస్ నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ఉందని అన్నారు. అది 111 జీవో పరిధిలోకి వస్తుందని, దానికి హైడ్రాకు సంబంధం లేదని అన్నారు. ఇప్పటి వరకు జ న్వాడ ఫాంహౌస్ కు తమ అధికారులు వెళ్లలేదని, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. హైడ్రా చేపడుతున్న వరుస కూల్చివేతలకు భయపడే హైకోర్టును ఆశ్రయించినట్టుగా భావిస్తున్నామని చెప్పారు.
హైడ్రా దూకుడు
చెరువులు, నాలాల్లో కబ్జాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా ఇప్పటి వరకు గండిపేట చెరువు పరిధిలో 40 అక్రమ కట్టడాలను కూల్చివేసింది. మొయినాబాద్ లో ఏడు, చందానగర్ పరిధిలో మూడు అక్రమ కట్టడాలని కూల్చివేసింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చాలా మంది తాము నిబంధనలు అతిక్రమించామా..? అని ఒక సారి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. మరికొందరు కావాల్సిన అనుమతి పత్రాలు వెతుక్కుని రెడీగా పెట్టుకుంటున్నారు. ఏది ఏమైనా హైడ్రా కొరడా ఝుళిపిస్తుండటంతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలైంది.