
హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల సంరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో హద్దులు నిర్ణయించేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో (NRSC) శుక్రవారం (ఏప్రిల్ 11) ఎంఓయూ కుదుర్చుకుంది. NRSC సహకారంతో శాటిలైట్ ఇమీజీల ద్వారా సరిహద్దులు నిర్ణయించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఓఆర్ఆర్ పరిధిలో ప్రభుత్వ భూములు, చెరువుల, పార్కుల సరిహద్దులు నిర్ణయించడానికి NRSC శాటిలైట్ ఇమేజీలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎక్కడ చెరువు ఉంది.. ఆ చెరువు విస్తీర్ణం ఎంత, కాలువలు, నాలాల పరిస్థితి ఏంటనే వివరాలను రూపొందించడంలో NRSC టెక్నాలజీ తమకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించి హద్దుల విషయంలో ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా సరైన సమాచారం అందించడమే హైడ్రా లక్ష్యమని ఈ సందర్భంగా అన్నారు. ఔటర్ పరిధిలో ప్రభుత్వ స్థలాల సరిహద్దులను నిర్ణయించడంలో ఇక నుంచి తేలిక అవుతుందని తెలిపారు.