శ్రీశైలం డ్యాంలో పూడికపై హైడ్రోగ్రాఫిక్‌ సర్వే

శ్రీశైలం డ్యాంలో పూడికపై హైడ్రోగ్రాఫిక్‌ సర్వే

కర్నూలు: శ్రీశైలం డ్యామ్ లో  పూడికపై హైడ్రోగ్రాఫిక్‌ సర్వే జరుగుతోంది. ఏటా మూడు టీఎంసీల పూడిక పెరుగుతోందని గతంలో జరిగిన సర్వేల్లో తేలిన నేపధ్యంలో తాజాగా మరోసారి సర్వే జరుగుతోంది. కృష్ణా జలాల వాడకంలో వివాదాల నేపధ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ కేంద్ర జల శక్తి శాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కృష్ణా నదితోపాటు, గోదావరి నది యాజమాన్యాల బోర్డు పరిధి, అధికారాలను నిర్ణయిస్తూ కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసలు డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం ఎంత.. పూడిక ఎంత మేర పేరుకుపోయిందో నిర్ధారణ అయిన తర్వాత నీటి పంపకాలను తేల్చాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 
ఇందులో భాగంగానే ముంబైకి చెందిన 12 మంది నిపుణులతో శనివారం నుండి సర్వే చేపట్టారు. బోటుపై నుంచి ఆధునికమైన పరికరాలను నీటిలోకి దింపి పూడిక ఎంత చేరిందో తేల్చేందుకు చర్యలు చేపట్టారు. డ్యాం క్రస్ట్ గేట్ల దగ్గర ఇరువైపులా.. మధ్యలో.. అలాగే డ్యాం నుంచి ఎగువకు ఎక్కడెక్కడ ఎంత మేర పూడిక పేరుకుపోయిందో నిర్ధారించే పనిలో పడ్డారు నిపుణులు. రెండు వారాలపాటు సర్వే జరిగే అవకాశం ఉందని డ్యాం నిర్వహణ అధికారులు చెబుతున్నారు. 
 శ్రీశైలం డ్యాం ను జాతికి అంకితం చేసిన సమయంలో కెపాసిటీ 315 టీఎంసీలు. అటు తర్వాత ఏటా వరదల వల్ల పూడిక పెరుగుతూ వస్తోంది. 2009లో భారీ వరదల తర్వాత ఒకసారి సర్వే చేయగా పూడిక భారీగా పెరిగిపోయినట్లు గుర్తించారు. డ్యాం కెపాసిటీ 315 నుంచి 215 టీఎంసీలకు పడిపోయినట్లు తేల్చారు. డ్యామ్ లో ఏటా పూడిక పెరుగుతుండడం వల్ల ఏటా 3 టీఎంసీల కెపాసిటీ తగ్గిపోతోందని అప్పటి సర్వేలో వెల్లడైంది. ఈ లెక్కన 2009 లెక్కల ప్రకారం శ్రీశైలం డ్యామ్ లో 215 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెబుతున్నా.. వాస్తవంలో 175లకు మించి నిల్వ ఉండే అవకాశం లేదని పలువురు నిపుణులు, రిటైర్డు ఇంజనీర్లు చెబుతున్నారు.  తాజా సర్వేతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు పేర్కొంటున్నారు.