30 ఏండ్లకే బీపీ, షుగర్: లైఫ్ స్టైలే కొంప ముంచుతోంది..

30 ఏండ్లకే బీపీ, షుగర్: లైఫ్ స్టైలే కొంప ముంచుతోంది..
  • ఎన్సీడీ క్లినిక్స్ స్క్రీనింగ్ టెస్టుల్లో వెల్లడి
  • 3 నెలల్లో 1.22 లక్షల మందికి పరీక్షలు
  • 26 వేల మందికి బీపీ, 43 వేల మందికి డయాబెటిస్​
  • కొత్తగా డయాబెటిక్ క్లబ్ లో 20 వేల మంది చేరిక


హైదరాబాద్, వెలుగు: దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్సీడీ(నాన్ కమ్యూనికేబుల్ డీసీజెస్) క్లినిక్స్ టెస్టుల్లో ఆందోళనకర విషయాలు బయటపడుతున్నాయి. ఎన్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేసిన 3 నెలల కాలంలోనే ఏకంగా 1. 22 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించగా.. అందులో 26,391 మంది హైపర్ టెన్షన్ (బీపీ), 43,768 మంది డయాబెటిస్ (షుగర్) తో బాధపడుతున్నట్టు గుర్తించారు. వీరికి ఎన్సీడీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఈ ఎన్సీడీ క్లినిక్స్ లో 30 ఏండ్లకు పైబడిన వారికే దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడంలో భాగంగా స్క్రీనింగ్ నిర్వహిస్తారు. 

వ్యాధి నిర్ధారణ అయిన వారిలో ఎక్కువ శాతం 30– 40 ఏండ్ల మధ్య వారు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడి, సమయానికి తిండి తినకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, తగిన నిద్ర లేకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్లే ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు చిన్న వయసులోనే దరిచేరుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే.. 30 ఏండ్లకు పైబడివారు రెగ్యులర్​గా షుగర్, బీపీ, ఇతర టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 

రాష్ట్రంలో 35 ఎన్సీడీ క్లినిక్స్​

దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో రోగులను గుర్తించి, మెరుగైన వైద్యం అందించాలని  మంత్రి దామోదర రాజర్సింహ ఆదేశించారు దీంతో నిరుడు డిసెంబర్ లో రాష్ట్ర వ్యాప్తంగా 35 ఎన్సీడీ సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాల్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ (జీజీహెచ్) లో వీటిని ఏర్పాటు చేయగా, స్థానిక పీహెచ్​సీల నుంచి దీర్ఘకాలిక రోగాల అనుమానిత వ్యక్తులను గుర్తించి, ఎన్సీడీ క్లినిక్స్ లో  స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో కింగ్ కోఠి, గాంధీ హాస్పిటల్స్ లో ఈ క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి. పీహెచ్​సీలలో గుర్తించిన వ్యక్తులను రాష్ట్రవ్యాప్తంగా వారానికోసారి 104 వాహనాల్లో  తరలించి, స్పెషలిస్టులతో చికిత్స అందిస్తారు. 

షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత  రోగనిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు.జాగ్రత్తలు, లైఫ్ స్టై‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసుకోవాల్సిన మార్పులపై అవగాహన కల్పిస్తారు. ట్రీట్​మెంట్​, మందులు ఇవ్వడంతోపాటు రోగులను ఫాలోఅప్ చేస్తున్నారు. అలాగే, ఎన్సీడీ రోగుల హెల్త్ ప్రొఫైల్ ను పక్కాగా భద్రపరుస్తారు. ఈ క్లినిక్స్​ వల్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి,  చికిత్స అందించడం సులువు అవుతుందని, అలాగే పేషంట్ల వివరాలు పక్కాగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది. మున్ముందు మరిన్ని ఎన్సీడీ క్లినిక్స్​ను ఏర్పాటు చేసేందకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

3 నెలల్లో 16 శాతం మందికి షుగర్​

ఎన్సీడీ క్లినిక్స్​లో  మొత్తం 1.20 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా.. అందులో పీహెచ్​సీల నుంచి రెఫర్ చేసిన 43 వేల మందికి ఇప్పటికే  షుగర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. వారంతా చికిత్స తీసుకుంటున్నారు. వీరు కాకుండా ఈ 3 నెలల్లో మరో 20 వేల మంది కొత్తగా డయాబెటిక్ క్లబ్ లో చేరడం ఆందోళన కలిగిస్తున్నది. స్క్రీనింగ్ చేసిన 1.20 లక్షల మందిలో దాదాపు 16 శాతం మంది కొత్తగా షుగర్‌‌‌‌ వ్యాధి నిర్ధారణ అయిన వారిలో ఉన్నారు. వీరే కాకుండా మరో 8,400 మంది కొత్తగా హైపర్ టెన్షన్ క్లబ్ లో చేరారు. షుగర్, బీపీ రోగుల సంఖ్య పెగరుతుండడం ఆందోళన కలిస్తున్నది.  

అలాగే, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల్లోనూ అనుమానిత కేసులు బయటపడుతున్నాయి. 73 వేల మందికి ఓరల్ స్క్రీనింగ్ టెస్టులు చేయగా, 890 మందికి ప్రాథమికంగా క్యాన్సర్ నిర్థారించారు. బ్రెస్ట్ క్యాన్సర్ కు సంబంధించి 37 వేల మందికి స్క్రీనింగ్ టెస్ట్​లు నిర్వహించగా.. 336 మందికి, 30 వేల మందికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయగా.. 350 మందికి ప్రాథమికంగా క్యాన్సర్​ నిర్ధారణ అయ్యింది. వీరికి తదుపరి పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించనున్నారు.