- టీవీఎస్‌తో కలిసి పనిచేయనున్న కంపెనీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ఆటోలను తయారు చేసేందుకు టీవీఎస్ మోటార్‌తో చేతులు కలపాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా చూస్తోంది. ఈ జాయింట్ వెంచర్‌లో ఆటోల తయారీని టీవీఎస్ చూసుకుంటుందని, డిజైన్, టెక్నాలజీని హ్యుందాయ్ చూసుకుంటుందని సంబంధిత వ్యక్తులు వివరించారు. ఈ బండ్లను ఇండియాలోనే తయారు చేయనున్నారు. టీవీఎస్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీగా పనిచేసే అవకాశం కూడా ఉంది. చిన్న బండ్లకు సంబంధించిన టెక్నాలజీని టీవీఎస్‌తో హ్యుందాయ్ గ్రూప్ పంచుకుంటుందని తెలిసింది. కాగా, ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటుపై హ్యుందాయ్, టీవీఎస్ స్పందించలేదు.
రానున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ క్రెటా మోడల్‌తోపాటు ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మోడల్‌ను కూడా ప్రదర్శనకు ఉంచనుంది. మరోవైపు టీవీఎస్ కూడా ఈ ఏడాది సొంతంగా ఎలక్ట్రిక్ త్రీ వీలర్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. రైడ్ పూలింగ్ సర్వీస్‌ల (క్యాబ్‌లను షేర్ చేసుకోవడం) ను అందించేందుకు తన యాప్ షక్ల్‌ను ఇండియాలో లాంచ్ చేయాలని హ్యుందాయ్ ప్లాన్ చేస్తోంది. ఈ యాప్ సౌత్ కొరియాలో అందుబాటులో ఉంది.