న్యూఢిల్లీ : హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ 2.37 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. బిడ్డింగ్ చివరి రోజు ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కనిపించింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐబీ) కోసం కేటాయించిన షేర్లు 6.97 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యాయి. కానీ, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి స్పందన కరువైంది. నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల పోర్షన్‌లో 60 శాతం షేర్లకు, రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్‌లో 50 శాతం షేర్లకు మాత్రమే కంపెనీ బిడ్స్ అందుకుంది.
ఇండియా ఐపీఓ హిస్టరీలో రూ.27,870 కోట్ల సైజ్‌తో అతిపెద్ద ఐపీఓగా హ్యుందాయ్ పబ్లిక్ ఇష్యూ నిలిచింది. దీనికంటే ముందు రూ.21 వేల కోట్ల సైజ్‌తో ఎల్‌ఐసీ ఐపీఓ అతిపెద్దదిగా కొనసాగింది. మూడు రోజుల బిడ్డింగ్ ప్రాసెస్‌లో సుమారు 10 కోట్ల షేర్లను హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకానికి పెట్టగా, సుమారు 24 కోట్ల షేర్ల కోసం బిడ్స్ అందాయి. ఇది 2.37 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌కు సమానం. కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,315 కోట్లను సేకరించింది. ఐపీఓలో ఒక్కో షేరును రూ.1,865–1,960 రేంజ్‌లో ఈ నెల 15–17 మధ్య అమ్మింది.