- సెప్టెంబర్‌లో 1,81,343 కార్లు అమ్మిన కంపెనీ
న్యూఢిల్లీ:కార్ల మార్కెట్‌లో తనకు తిరుగులేదని మారుతి సుజుకీ మరోసారి నిరూపించింది. కిందటి నెలలో రికార్డ్ స్థాయిలో బండ్లను అమ్మి తన నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. కిందటేడాది సెప్టెంబర్‌లో 1,76,306 కార్లను అమ్మిన మారుతి, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 1,81,343 బండ్లను సేల్ చేసింది. ఇది 3 శాతం గ్రోత్‌కు సమానం. అంతేకాకుండా కంపెనీకి ఇదే అత్యధిక నెలవారి సేల్స్. సెప్టెంబర్‌లో ఇండియన్ మార్కెట్‌లో 1,50,812 కార్లు అమ్మింది.
మొదటి ఆరు నెలల్లోనే 10 లక్షల కార్లు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఆరు నెలల్లోనే (ఏప్రిల్–సెప్టెంబర్) మారుతి సుజుకీ 10,50,085 కార్లను సేల్ చేసింది. కంపెనీ ఆరు నెలల్లోనే మిలియన్ కార్ల సేల్స్ మార్క్‌ను అందుకోవడం ఇదే మొదటిసారి. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌లో 9,85,326 కార్లు అమ్మింది. మిగిలిన కంపెనీల కార్ల సేల్స్ వేలల్లో ఉంటే మారుతి మాత్రం ప్రతీ నెల లక్షన్నరకు పైగా కార్లను సేల్ చేస్తోంది. కిందటి నెలలో కంపెనీకి చెందిన ఆల్టో, ఎస్‌ప్రెస్సో వంటి చిన్న కార్ల అమ్మకాలు 65 శాతం (ఇయర్ ఆన్ ఇయర్) తగ్గాయి. అలానే కాంపాక్ట్ కార్ల అమ్మకాలు కూడా పడిపోయాయి. కానీ, యుటిలిటీ వెహికల్స్ సేల్స్ మాత్రం 82 శాతం పెరగడం విశేషం. కాగా, మారుతి సుజుకీకి ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ.2,485 కోట్ల ప్రాఫిట్ వచ్చింది.
నెంబర్ 2 కూడా అదే బాటలో ..
మార్కెట్‌లో నెంబర్ 2 పొజిషన్‌లో కొనసాగుతున్న హ్యుండాయ్ మోటార్స్ ఇండియా కిందటి నెలలో రికార్డ్ లెవెల్ అమ్మకాలు జరిపింది. కిందటేడాది సెప్టెంబర్‌లో 63,201 కార్లను సేల్ చేసిన కంపెనీ, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 71,641 కార్లను అమ్మగలిగింది. ఇది 13 శాతం గ్రోత్‌కు సమానం. ఇందులో 54,241 బండ్లను ఇండియాలో అమ్మింది. కంపెనీ ఎక్స్‌పోర్ట్స్ 29 శాతం పెరిగి 13,501 బండ్ల నుంచి 17,400 బండ్లకు ఎగసింది. కంపెనీ తాజాగా ఎస్‌యూవీ మోడల్ ఎక్స్‌టర్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. దీంతో తమ ఎస్‌యూవీ పోర్టుఫోలియో మరింత బలంగా మారిందని, కంపెనీ సేల్స్‌లో 65 శాతం వాటా ఎస్‌యూవీలదేనని హ్యుండాయ్ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఎక్స్‌టర్‌కు 89 వేల బుకింగ్స్ వచ్చాయని వెల్లడించింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో లీడర్‌గా క్రెటా కొనసాగుతోందని పేర్కొంది.
తగ్గిన టాటా కార్ల సేల్స్..
టాటా మోటార్స్ కిందటి నెలలో 45,317 కార్లు (ఇందులో ఈవీలు కూడా కలిసి ఉన్నాయి), 39,064 కమర్షియల్ వెహికల్స్‌ను అమ్మగలిగింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం కంపెనీ కార్ల సేల్స్ సెప్టెంబర్‌లో 5 శాతం పడిపోగా, కమర్షియల్ వెహికల్ సేల్స్ మాత్రం 12 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో టాటా మోటార్స్ 1,04,085 కమర్షియల్ వెహికల్స్‌ను, 1,38,939 కార్లను అమ్మింది. మరోవైపు టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు కిందటి నెలలో 23,590 కార్లకు పెరిగాయి.