- కొద్దిగా పెరిగిన మారుతి, ఎం అండ్ ఎం సేల్స్ పడిన హ్యుండాయ్, టయోటా అమ్మకాలు
ఆఫర్లను అధికంగా ఇచ్చినప్పటికీ గతేడాది చివరి నెలలో ఆటో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన ఆటో సేల్స్ డేటా బుధవారం వెలువడింది. ఇండియా మార్కెట్‌లో అతిపెద్ద కార్ల కంపెనీ అయిన మారుతి సుజుకీ అమ్మకాలు 2.4 శాతం పెరగగా, మహింద్రా అండ్ మహింద్రా అమ్మకాలు ఒక శాతం పెరిగాయి. అయితే హ్యండాయ్ సేల్స్ 10 శాతం, టయోటా అమ్మకాలు 38 శాతం తగ్గాయి. జూలై 2019లో ఇండియా మార్కెట్‌లో అడుగుపెట్టిన ఎంజీ మోటర్స్ అమ్మకాలు మాత్రం పర్వాలేదనిపించాయి. 2019 డిసెంబర్‌లో తమ కార్ల అమ్మకాలు 2.4 శాతం పెరిగాయని మారుతి సుజుకీ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ నెలలో కంపెనీ 1,24,375 వాహనాలను విక్రయించగా, డిసెంబర్ 2018లో కంపెనీ 1,21,479 వెహికిల్స్‌ను అమ్మింది. ఇతర ఒరిజినల్ ఎక్యుప్‌మెంట్ మాన్యుఫ్యాక్చర్స్ (ఓఈఎం)కు విక్రయించిన అమ్మకాలను కూడా కలుపుకుంటే, కంపెనీ సేల్స్ మొత్తంగా 3.9 శాతం పెరిగి 1,33,296 వెహికిల్స్‌గా ఉన్నాయి. మారుతి సుజుకీ ఆల్టో సేల్స్ 13.6 శాతం పడిపోయి 23,883 వాహనాలుగా నమోదయ్యాయి. అయినప్పటికి న్యూ వేగన్ ఆర్, స్విఫ్ట్, సెలరియో, డిజైర్ వంటి కాంపాక్ట్ కార్ల అమ్మకాలు పెరిగి 65,673 యూనిట్లకు చేరుకున్నాయి. మిడ్‌సైజ్ సియాజ్ సేల్స్ 62.3 శాతం పడిపోయి 1,786 వాహనాలుగా ఉన్నాయి.
ఎంజీ మోటర్స్
గతేడాదే ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఎంజీ మోటర్స్ విక్రయాలు పర్వాలేదనిపించాయి. కంపెనీ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ హెక్టార్ అమ్మకాలు 2019 డిసెంబర్‌లో 3,021 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. 2019లో ఎంజీ మోటర్స్ అమ్మకాలు 15,930 యూనిట్లకు చేరుకున్నాయి.
38% పడిన టయోటా సేల్స్
టయోటా సేల్స్ 2019 డిసెంబర్‌లో 38 శాతం పడిపోయాయి. కంపెనీ అమ్మకాలు డిసెంబర్ నెలలో 7,769 వాహనాలుగా ఉన్నాయని టయోటా కిర్లోస్కర్ మోటర్(టీకేఎం) ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ 2018 డిసెంబర్‌లో 12,489 వాహనాలను విక్రయించిందని పేర్కొంది. ఇండియా మార్కెట్లో టయోటా అమ్మకాలు గత నెలలో 6,544 వాహనాలుగా ఉన్నాయని, ఇవి 2018 డిసెంబర్‌లో అమ్ముడైన 11,836 యూనిట్ల కంటే 45 శాతం తక్కువని కంపెనీ తెలిపింది. 2019 డిసెంబర్‌లో కంపెనీ ఎగుమతులు 1,225 యూనిట్లుగా ఉండగా, 2018 డిసెంబర్‌లో 653 వాహనాలను మాత్రమే ఎగుమతి చేసింది. మొత్తంగా 2019లో ఇండియా మార్కెట్లో టయోటా అమ్మకాలు 1,26,701 వాహనాలుగా ఉన్నాయి. ఇది 2018 లో అమ్ముడైన 1,51,480 వాహనాల కంటే 16.36 శాతం తక్కువ.
తగ్గిన హ్యుండాయ్ అమ్మకాలు..
హ్యుండాయ్ మోటర్స్ ఇండియా అమ్మకాలు మొత్తంగా 2019 డిసెంబర్‌లో 9.9 శాతం మేర పడిపోయాయి. కంపెనీ అంతకుముందు ఏడాది 55,638 వాహనాలను విక్రయించగా, 2019 డిసెంబర్‌లో 50,135 వాహనాలను మాత్రమే అమ్మగలిగింది. కంపెనీ అమ్మకాలు దేశీయంగా అయితే 9.8 శాతం పడిపోయి 37,953 వాహనాలుగా ఉన్నాయి. డిసెంబర్ 2018 లో దేశీయంగా ఈ కంపెనీ 42,093 వాహనాలను అమ్మింది. కంపెనీ ఎగుమతులు గత నెలలో 10.06 శాతం పడిపోయి 12,182 వాహనాలుగా నమోదయ్యాయి. 2018 డిసెంబర్‌లో 13,545 వాహనాలను ఎగుమతి చేసింది.
మొత్తంగా 2019లోనూ తగ్గాయ్…!
మొత్తంగా 2019 లో హ్యుండాయ్ అమ్మకాలు 2.6 శాతం తగ్గి 6,91,460 వాహనాలుగా ఉన్నాయి. 2018 లో 7,10,012 వాహనాలను కంపెనీ విక్రయించగలిగింది . దేశీయ మార్కెట్‌లో కంపెనీ అమ్మకాలు 2019లో 510,260 వాహనాలుగా ఉన్నాయి. ఈ అమ్మకాలు 2018 లో నమోదైన 5,50,002 వాహనాల కంటే 7.2 శాతం తక్కువ. కంపెనీ 2019 లో 181,200 వాహనాలను ఎగుమతి చేయగా, 2018లో 1,60,010 వాహనాలను ఎక్స్‌పోర్ట్ చేసింది. అంటే అంతకుముందు ఏడాది కంటే ఈ ఎగుమతులు 13.2 శాతం ఎక్కువ.
పెరిగిన ఎం అండ్ ఎం సేల్స్..
2019 డిసెంబర్‌లో ఎం అండ్ ఎం విక్రయాలు ఒక శాతం పెరిగాయి. కంపెనీ కమర్షియల్ వెహికిల్స్ అమ్మకాలు తగ్గినప్పటికీ, ప్యాసింజర్, యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. గత నెలలో కంపెనీ 37,081 వెహికిల్స్‌ను అమ్మిందని, 2018 డిసెంబర్‌లో 36,690 వాహనాలను మాత్రమే విక్రయించినట్టు కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 4 శాతం పెరిగి 15,691 యూనిట్లుగా, యుటిలిటీ వాహనాల అమ్మకాలు 10 శాతం పెరిగి 15,225 వాహనాలుగా ఉన్నాయని పేర్కొంది. కానీ కంపెనీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు 5 శాతం తగ్గి 16,018 వాహనాలుగా ఉన్నాయని తెలిపింది. ఎం అండ్ ఎం ఎగుమతులు గత నెలలో 30 శాతం తగ్గి 2,149 వాహనాలకు పడిపోయింది. గతేడాది ఏప్రిల్-–డిసెంబర్ మధ్యన ఎంఅండ్ ఎం వాహనాల విక్రయాలు 11 శాతం పడిపోయి 3.6 లక్షలుగా ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ స్టాక్ లెవెల్స్‌పై సంతృప్తిగా ఉన్నామని ఎం అండ్ ఎం సేల్స్, మార్కెటింగ్ చీఫ్ విజయ్ రామ్ నక్రా అన్నారు.