ప్రాణం పోయినా పార్టీ వీడను.. జగన్‌తోనే నా ప్రయాణం: విజయసాయిరెడ్డి

ఏపీ రాజకీయాల్లో వలసలు జోరందుకున్నాయి. అధికారం కోల్పోయాక ఉండి లాభం లేదనుకుంటున్న వైసీపీ నేతలు ఒక్కక్కరిగా పార్టీని వీడుతున్నారు. కష్టకాలంలో అందరూ ఒక్కటై అధినేతకు తోడుగా ఉంటారనుకుంటే.. వారి వారి రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. 

ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ సభ్యత్వంతో పాటు తన పదవికి రాజీనామా చేయగా.. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, జగన్‌కు అత్యంత సన్నిహితుడు విజయసాయిరెడ్డి వంటి వారు పార్టీని వీడనున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మీడియా ముందుకొచ్చారు. తాను పార్టీ వీడుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. ప్రజల నేత, రాజన్న బిడ్డ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెలిపారు.

జగన్‌తోనే ఉంటా..: విజయసాయిరెడ్డి

"నేను వైఎస్ఆర్‌సీపీకి విధేయత, అంకితభావం, నిబద్ధత కలిగిన కార్యకర్తనని స్పష్టం చేయాలనుకుంటున్నాను. నేను వైఎస్‌ఆర్‌సీపీలోనే ఉంటాను. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తాను. నేను వైసీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరుతున్నానని మీడియాలో ఒక వర్గం చేస్తున్న నిరాధారమైన ఊహాగానాలు, తప్పుడు సమాచారాన్ని ఖండిస్తున్నాను.." అని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ALSO READ | జగన్ కు షాక్ : ఇద్దరు వైసీపీ ఎంపీలు రాజీనామా