న్యూఢిల్లీ: తాను వ్యాపారానికి వ్యతిరేకిని కాదని, గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్ లీడర్, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. వాణిజ్యాన్ని ఐదారు మంది శాసించడాన్ని వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు. బీజేపీ మాత్రం తనను వ్యాపార వ్యతిరేకిలా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. తాను మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించానని, వ్యాపారం సక్సెస్ కావడానికి అవసరమైన విషయాలను అర్థం చేసుకోగలనని అన్నారు.
దేశంలో కొందరు బిజినెస్‌మాన్‌లు గుత్తాధిపత్యం చలాయిస్తున్నారంటూ ఇటీవల్ నేషనల్ మీడియాకు రాహుల్ ఓ ఆర్టికల్ రాశారు. మార్కెట్‌ను అతికొద్దిమంది కంట్రోల్ చేస్తున్నారని, దాంతో వేలాది చిన్న కంపెనీలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పన సాధ్యం కాకపోగా, అనేక మంది యువ వ్యాపారవేత్తలు గుత్తాధిపత్యాన్ని చూసి వెనకడుగు వేస్తున్నారని తెలిపారు. 150 ఏండ్ల కింద పతనమైన ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానంలో ప్రస్తుతం గుత్తేదారులు వచ్చారని ఆరోపించారు. దీనిపై బీజేపీ వివర్శలు చేయడంతో రాహుల్ గురువారం ఓ వీడియో మెసేజ్‌లో క్లారిటీ ఇచ్చారు.