తాను ఎంపీగా ఉండి కూడా అధికారుల వల్ల ఇబ్బందులకు గురైనట్లు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏ అధికారి ఇబ్బందులకు గురి చేసినా తనకు చెప్పాలని.. 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు. నల్గొండ ఎంపీగా పార్లమెంట్ లో నియోజకవర్గ ప్రజల గొంతు వినిపించినట్లు తెలిపారు. హాలియా లక్ష్మీ నరసింహ గార్డెన్ లో అనుముల మండల కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే బాగుపడిందని... ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చిందని తెలిపారు.
టీఆర్ఎస్ , బీజేపీ దొంగ నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రైతు రుణమాఫీ ఏమైంది ? 4ఏళ్ళు కావస్తున్నా ఎందుకు చేయలేదని నిలదీశారు. ఏ దేశంలో లేని స్వేచ్ఛ మన దేశంలో ఉందన్న ఆయన... ప్రపంచ అగ్ర దేశాల్లో భారత దేశం 5వ స్థానంలో, సైన్యంలో 4వ స్థానంలో ఉందన్నారు. మహాత్మా గాంధీకి జవహర్ లాల్ నెహ్రులకు మనం వారసులమన్నారు. సత్యాగ్రహ మార్గం ద్వారా స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని.. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పార్టీ కష్టాల్లో లేదన్నారు. సీనియర్ నాయకులు జానారెడ్డి ఏది చేపట్టినా... ఆయన అడుగుజాడల్లో నడుస్తానని.. వారికి తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగింపు రోజున హాత్ సే హాత్ కలపండి అనే నినాదం తో ముందుకు పోదామని కార్యకర్తలకు సూచించారు.