
- పరోక్షంగా బీజేపీకి ఢిల్లీ మాజీ సీఎం సెటైర్
- ఆ పార్టీ అధికారంలోకి వస్తే మా పథకాలను ఆపేస్తుంది
- జాట్ల రిజర్వేషన్ల కోసం ఫైట్ చేస్తానన్న కేజ్రీవాల్
న్యూ ఢిల్లీ: తాను బనియా (వర్తకుల) కులానికి చెందిన వాడినని, సంక్షేమ పథకాలకు డబ్బులు సమకూర్చడం ఎలాగో తనకు తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ ఆర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా బీజేపీకి చురకలంటించారు. అసెంబ్లీ ఎన్నికలకు 10 రోజులకంటే తక్కువ సమయమే మిగిలి ఉండడంతో కేజ్రీవాల్ ప్రచార జోరు పెంచారు. మంగళవారం పాలెం, మటియాల, బిజ్వాసన్‌లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘‘సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడినుంచి వస్తాయని వారు (బీజేపీ) అడుగుతున్నారు.
నేనో వ్యాపారిని. రిసోర్స్‌ను ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు. మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. నాకు మ్యాథ్స్ తెలుసు. నేను డబ్బులు సమకూరుస్తా” అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆప్ తీసుకొచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అన్నింటినీ ఆపేస్తుందని ఆరోపించారు. గవర్నమెంట్ స్కూల్స్, ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని నిలిపేస్తారని అన్నారు. స్కూళ్లు కట్టే ఆప్ కావాలా? లేక వాటిని మూసివేసే బీజేపీ కావాలా? అనేది తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆప్ సామాన్యుల పార్టీ
ఆప్ సామాన్యుల పార్టీ అయితే.. బీజేపీ ధనికుల పార్టీ అని అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని ప్రజలకు ఆప్ నెలకు రూ.25వేల విలువైన ప్రయోజనం చేకూర్చుతుందని, బీజేపీ మాత్రం తన ధనిక స్నేహితుల రుణాలను మాఫీ చేస్తుందని అన్నారు. ఢిల్లీలో జాట్ కమ్యూనిటీ తీవ్ర అన్యాయానికి గురవుతున్నదని చెప్పారు. రాజస్థాన్, హర్యానాలాంటి రాష్ట్రాల్లో జాట్లు ఓబీసీ ప్రయోజనాలు పొందుతుంటే.. ఇక్కడ వారిని ఓబీసీనుంచి మినహాయించడం అన్యాయమని మండిపడ్డారు.
‘‘ఢిల్లీలో జాట్లతోసహా 54 ఓబీసీ కులాలున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ జాబితాలో 50 కులాలు మాత్రమే చేర్చారు. రాజస్థాన్‌లోని జాట్స్ ఢిల్లీ వర్సిటీ, ఎయిమ్స్‌లో ఓబీసీ కోటాలో అడ్మిషన్ పొందుతుంటే.. ఢిల్లీ జాట్లు మాత్రం అన్యాయానికి గురవుతున్నారు. జాట్లను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాలో చేర్చేలా నేను కొట్లాడుతానని హామీ ఇస్తున్నా” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
మధ్య తరగతి ప్రజల హోమ్ లోన్స్..
దేశంలోని రైతులు, మధ్య తరగతి ప్రజల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు కేంద్రానికి అర్వింద్ కేజ్రీవాల్ ఓ లేఖ రాశారు. ‘‘ధనికుల రుణాలను మాఫీ చేయబోనని ప్రధాని మోదీ ప్రకటించాలి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే రైతుల పంట రుణాలు, మధ్య తరగతి ప్రజలు తీసుకున్న హోమ్లోన్స్ మాఫీ చేయండి. ఇది మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది” అని సూచించారు. రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు.
‘యమున నీళ్లలో విషం’పై ఆధారాలు ఇవ్వండి: ఈసీ లేఖ
యమునా నది నీళ్లలో హర్యానాలోని బీజేపీ సర్కారు విషం కలుపుతోందంటూ సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఉన్నాయని తెలిపింది. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బుధవారం రాత్రి 8 గంటలలోగా అందజేయాలని ఆదేశిస్తూ ఆయనకు ఈసీ మంగళవారం లేఖ రాసింది.
‘‘యమునా నది నీళ్లలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోంది. యమున నుంచి ఢిల్లీకి సరఫరా చేసే ఆ విషపూరిత నీళ్ల వల్ల దేశ రాజధానిలో కల్లోలం రేపడం ద్వారా ఆప్ సర్కారుకు చెడ్డపేరు తేవాలన్నదే బీజేపీ ప్లాన్” అని కేజ్రీవాల్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కేజ్రీవాల్ కామెంట్లపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేసింది.