రూ. 76 లక్షలు పెద్ద జీతం కాదు.. ఉద్యోగం పోయినందుకు నేనుచాలా హ్యాపీ: మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

రూ. 76 లక్షలు పెద్ద జీతం కాదు.. ఉద్యోగం పోయినందుకు నేనుచాలా హ్యాపీ: మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

పది వేల నుంచి పాతిక వేల జీతమిచ్చే ఉద్యోగం పోతేనే ఎలా బ్రతకలిరా బావోయ్ అని గుక్కపట్టి ఏడ్చే రోజులివి. ఇలాంటి ఈ కాలంలో ఏడాది రూ. 76 లక్షల జీతం వచ్చే ఉద్యోగం పోయిందందుకు ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సంతోషంగా ఉన్నారట. బయటకు అలా చెప్తోంది కానీ, లోలోపల ఎంత కుమిలిపోయుంటదో కదా..! 

24 ఏళ్ల సియెర్రా డెస్మరాట్టి అనే మహిళా ఉద్యోగి రెండేళ్ల ముందు(2022లో) చికాగోలోని డెలాయిట్‌ కంపెనీలో అనలిస్ట్‪గా ఉద్యోగంలో చేరింది. అప్పుడు ఆమె జీతం ఏడాదికి రూ. 76 లక్షలు. అయితే, ఆర్థిక మాంద్యం భయాలు, ఖర్చుల తగ్గింపులో భాగంలో కంపెనీ ఆమెను ఉద్యోగం నుండి తీసేసింది. 'మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించాం.. మున్ముందు ఆఫీస్ కు రానక్కర్లేదు..' అని డెలాయిట్‌ కంపెనీ డెస్మరాట్టికి ఈ-మెయిల్ ద్వారా లేఆఫ్ విషయాన్ని తెలియజేసింది. ఆ సందేశం చూడగానే ఆమె ఎగిరి గంతేసిందట. ఈ విషయాన్ని ఉద్యోగం పోయిన ఏడాది తరువాత బయటపెట్టింది. 

9 కిలోల బరువు పెరిగా.. 

జీవితంలో తనకేదైనా మంచి జరిగిందంటే.. అది ఈ ఉద్యోగం పోవడమేనని డెస్మరాట్టి చెప్పుకొచ్చింది. రోజంతా కుర్చీలో కూర్చోలేకపోయానని, పొట్టి బట్టలేసుకుని తోటి ఉద్యోగుల ముందు నడవలేకపోయానని ఆమె తాను పడిన బాధనంతా వెళ్లగక్కింది. 

"నేను తక్కువ ఆదాయ కుటుంబం నుంచి వచ్చిన దానిని. అయినప్పటికీ నా ఉద్యోగం పోయినందుకు చాలా సంతోషించపడ్డా. నేను ఉద్యోగంలో చేరిన సమయంలో డెలాయిట్‌ భవనంలో 80 నుండి 90 మంది ఉద్యోగులు ఉండేవారు. వారిని చూశాక.. వారిలాగే బట్టలు ధరించాల్సి వచ్చింది. నాకవి నచ్చేవి కాదు కానీ, తప్పలేదు. అంతేకాదు రోజంతా సీటుకు అతుక్కుపోవడం వల్ల వెన్ను నొప్పి వచ్చింది. పని ఒత్తిడితో నచ్చిన ఆహారాన్ని తినలేకపోయా.. స్నాక్స్‌పై ఆధారపడటం వల్ల నెలల వ్యవధిల్లోనే 9 కిలోల బరువు పెరిగా.. చివరకు ఉద్యోగం పోయాక చాలా సంతోష పడ్డా.." 

"ఇక రూ.76 లక్షలు జీతమంటారా..! అది నా  మనుగడకు సాధనం తప్ప అదే జీవితం కాదు. పొదుపు చేసిన డబ్బుతో రెండు నెలలు గడిపాను.. తరువాత ట్రాన్స్‌అమెరికాకు చెందిన కంపెనీలో యాక్చురియల్ అనలిస్ట్‌గా రిమోట్ ఉద్యోగం వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నా.." అని డెస్మరాట్టి వెల్లడించింది.

కాగా, గత రెండేళ్లుగా కాస్ట్ కటింగ్ లో భాగంగా కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారందరూ ఉద్యోగం పోయిందని ఏడవకుండా.. మరొకటి చూసుకోవాలని ధైర్యాన్ని ఇచ్చేదుకు ఆమె ఈ హిత బోధన చేసిందనమాట. కావున ఉద్యోగం పోతే ఏడవకండి.. మీ బాస్ మిమ్మల్ని వేధించిన ఘటనలు, తిట్టిన తిట్లు గుర్తు తెచ్చుకోండి.. సంతోషపడతారు.