మీడియా ముందు ట్రూడో కంటతడి.. కెనడా ప్రధానిగా ప్రజలను ఉద్దేశించి చివరి ప్రసంగం

మీడియా ముందు ట్రూడో కంటతడి.. కెనడా ప్రధానిగా ప్రజలను ఉద్దేశించి చివరి ప్రసంగం
  • తొమ్మిదేండ్లలో కెనడియన్లకే ప్రయార్టీ ఇచ్చానని వెల్లడి
  • ట్రంప్ విధించిన టారిఫ్​లపై విమర్శలు

ఒట్టావా(కెనడా): తొమ్మిదేండ్ల పాలనలో తన శక్తిమేర ప్రజల కోసం పనిచేశానని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. కెనడియన్లకు తొలి ప్రయార్టీ ఇచ్చానన్నారు. దేశ ప్రయోజనాలే ప్రాధాన్యంగా పని చేశానని చెప్పారు. ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించిన ట్రూడో శుక్రవారం ప్రధాని హోదాలో చివరిసారిగా ప్రసంగించారు. పీఎంగా తన హయాంలో ఎదురైన సవాళ్లు, ఒడిదుడుకుల గురించి చెప్తూ ట్రూడో తీవ్రభావోద్వేగానికి లోనయ్యారు. 

మీడియాతో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కెనడియన్ల మధ్య మరింత ఐక్యత అవసరమని అన్నారు. కష్టకాలం ముందుందని హెచ్చరించారు. కెనడా సరుకుల దిగుమతిపై అమెరికా విధించిన పన్నులు, టారీఫ్​ల తీరుపైనా ట్రూడో విమర్శలు చేశారు. మెక్సికో, కెనడా దేశాలు బాగున్నప్పుడే అమెరికాకు ప్రయోజనాలు దక్కుతాయన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలన్నారు. 

అయితే, రియల్ ఎస్టేట్​ బిజినెస్​లో మాత్రం అది సాధ్యం కాదంటూ పరోక్షంగా ట్రంప్​నుద్దేశించి కామెంట్ చేశారు. ట్రంప్ పాలనను ఐదేండ్లు చూశానని అన్నారు. వందేండ్లకోసారి వచ్చే మహమ్మారి, ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధం, డొనాల్డ్​ ట్రంప్​ను తన తొమ్మిదేండ్ల పాలనలో ఎదుర్కొన్నానని అన్నారు. ఈ కష్టాలన్నింటినీ దాటుకుంటూనే దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేశానని చెప్పారు. తన చివరిరోజువరకు కెనడియన్లకోసం పనిచేస్తూనే ఉంటానని చెప్పారు.

9న కొత్త నాయకుడి ప్రకటన?

ప్రజల్లో తగ్గుతున్న పాపులారిటీతో పాటు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలవడంతో లిబరల్ పార్టీ ప్రెసిడెంట్, ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని జస్టిన్ ట్రూడో జనవరి 6న ప్రకటించారు. పార్టీ సభ్యుల నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు పెరగడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కొత్త లీడర్​ను ఎన్నుకున్న రోజున రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే, ఈ నెల 9న లిబరల్ పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటం.. 

అమెరికా విధించిన పన్నుల విధానాన్ని కెనడా తప్పుపట్టింది. తామూ పన్ను చార్జీలను పెంచుతామని హెచ్చరించింది. అమెరికాకు విద్యుత్ సప్లయ్​ని పూర్తిగా నిలిపివేస్తామంది. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు చట్టసభ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..