నాగర్ కర్నూల్ , వెలుగు: ‘ప్రమాదంలో చిక్కుకున్నా.. క్షేమంగా వస్తా..’ తన ఫ్యామిలీతో ఏఈ మోహన్ కుమార్ చెప్పినచివరి మాటలివి. రాత్రి 12 గంటల సమయంలో ఆయన తన ఇంటికి ఫోన్ చేశారు. ప్రమాదం జరిగిన సంగతి చెప్పి, టెన్షన్ పడవద్దని, క్షేమంగా తిరిగొస్తానని అన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మోహన్ కుటుంబ సభ్యులు, బంధువులు పవర్ ప్ల ాంట్ వద్దకు చేరుకుని.. సాయంత్రం దాకా ఎదురుచూశారు. ఒక్కో డెడ్ బాడీ బయటపడుతుంటే క్షణం క్షణం ఊపిరి బిగపట్టి గడిపారు. మోహన్ ప్రాణాలతో తిరిగొస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ సాయంతం 4 గంటల సమయంలో ఆయన డెడ్ బాడీ దొరికింది. దీంతో మోహన్ కుటుంబ సభ్యులు గుండె లు పగిలేలా రోదించారు. ప్రమాదం గురించి చెప్పి, క్షేమంగా బయటపడతామని చెప్పి మోసం చేసి పోయాడంటూ ఆయన భార్య కన్నీరు మున్నీరయ్యారు. మంటలు గమనించిన వెంటనే ఏఈలు మోహన్, ఉజ్మ ఫాతిమా, సుందర్.. మిగిలిన వారిని హెచ్చరించారని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ తోటి ఉద్యోగులు చెప్పారు. చివరి దాకా మంటలను ఆర్పడానికి ఆయన పోరాడారన్నారు. పొగలు అలుముకోవడంతో ఆ వైపు రావద్దని మోహన్ గట్టిగా అరిచారని, ప్లాంట్ ను కాపాడేందుకు ప్రాణాలు త్యాగం చేశారని చెప్పారు.