
ఆమని టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. టి.వి. రవి నారాయణ్ దర్శకత్వంలో వల్లూరి రాంబాబు నిర్మిస్తున్నారు. శనివారం జరిగిన టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. కీలకపాత్ర పోషించిన మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలి కథతో రూపొందుతున్న చిత్రంలో నటించడం సంతోషంగా ఉంది.
ఆమని గారికి ఈ చిత్రంతో జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు. ఆమని మాట్లాడుతూ ‘ఈ పాత్ర పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటివి చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. మంచి ఉద్దేశంతో చేస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది. ‘డొక్కా సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ చెప్పిన మాటల స్ఫూర్తితో ఈ సినిమా చేశానని, సినిమా ద్వారా వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని ఆమె పేరు మీద ఉన్న పథకానికి విరాళంగా ఇస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.