- ఆ సమాజాన్ని నేను కించపర్చలేదు: ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
- కల్వకుంట్ల కుటుంబంపైనే విమర్శలు చేసిన
- ఎవరైనా బాధపడి ఉంటే నా కామెంట్లు వెనక్కి తీసుకుంటున్న అని వ్యాఖ్య
షాద్ నగర్, వెలుగు: కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్లు చేశానే తప్ప.. వెలమ సమాజాన్ని తాను కించపర్చలేదని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వెనుక.. ముందు కట్ చేసి వివాదాస్పదంగా మార్చారని మండిపడ్డారు. వెలమ సమాజానికి సంబంధించినవిగా భావిస్తే.. తన వ్యాఖ్యలు ఉప సంహరించుకుంటున్నట్లు తెలిపారు.
షాద్‌నగర్‌లోని క్యాంపు ఆఫీస్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను ఒక ఎమ్మెల్యేని.. అందరి సహకారంతోనే గెలిచాను. అన్ని వర్గాలను గౌరవిస్తాను. గత పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కల్వకుంట్ల కుటుంబం గురించి మాత్రమే మాట్లాడాను. నియంతృత్వ ధోరణి అవలంబించిన ఆ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ విమర్శించాను. వెలమ సమాజాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు.
రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం అప్పులకుప్పగా మార్చిందన్నాను. వెలమలు అంటే నాకెంతో గౌరవం ఉంది. వాళ్లపై నాకు ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదు. ఒకవేళ నేను చేసిన కామెంట్లు వెలమలను బాధపెట్టేలా ఉంటే వాటిని వెనక్కి తీసుకుంటున్నాను’’అని చెప్పారు.