నేను ఏ పార్టీలో చేరడం లేదు.. వ్యవసాయం చేసుకుంటా..: విజయసాయి రెడ్డి

నేను ఏ పార్టీలో చేరడం లేదు.. వ్యవసాయం చేసుకుంటా..: విజయసాయి రెడ్డి

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటు, ఆ పార్టీ రాజ్య సభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. శుక్రవారం ఈ మేరకు విజయసాయిరెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అయితే, విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, ఆయన త్వరలో మరో పార్టీలో చేరబోతున్నారంటూ పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీనిపై ఆయన తన పోస్ట్‌లోనే క్లారిటీ ఇచ్చారు. 

రైతుగా మారి వ్యవసాయం..

విజయసాయి రెడ్డి మరో పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక.. ఆయన వ్యవసాయానికే పరిమితమవుతారని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని విజయసాయి రెడ్డి తన ప్రకటనలోనూ వెల్లడించారు. తన భవిష్యత్తు వ్యవసాయమేనని అన్నారు.

Also Read : రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై

ఎవరి బలవంతం లేదు..

రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంలో ఎవరి బలవంతం లేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ఎలాంటి ఒత్తిళ్లు లేవని క్లారిటీ ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి ఎల్లప్పుడూ రుణపడి ఉన్నానని అన్నారు. జగన్ గారికి మంచి జరగాలని ఆకాంక్షించారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పుకొచ్చారు.