కూర్చోమంటే కూర్చోవడానికి పాలేరును కాను : మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్​

  •     పాపతో బ్లాక్ మెయిల్ చేసినవని కౌశిక్​పై విమర్శలు

హైదరాబాద్, వెలుగు : ‘‘భయపెట్టిస్తే భయపడేవాడిని కాదు.. కూర్చోమంటే కూర్చోవడానికి పాలేరును కాదు..” అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేయకపోతే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటామని, గెలవకపోతే మా శవయాత్ర చూస్తారన్న వాళ్లూ ఇక్కడ మాట్లాడుతున్నారని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ఇటీవల గవర్నర్ కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ కావద్దన్నరని గుర్తుచేశారు. బడ్జెట్​పై చర్చ సందర్భంగా పొన్నం సభలో మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో కాలువలు పారుతున్నాయంటే గత కాంగ్రెస్ పాలనలో తవ్వినవేనని అన్నారు. 

వరద కాలువలు, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, లోయర్ మానేరు ప్రాజెక్టులు ఎవరు కట్టారో చరిత్ర చూడాలని సూచించారు. పదేండ్లు సిరిసిల్లా ఎమ్మెల్యేగా ఉండి, 9వ ప్యాకేజీ అప్పర్ మానేరు పూర్తి చేయని యువరాజు కూడా మాట్లాడితే ఎట్లా అని కేటీఆర్​ను ఉద్దేశించి అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ లేదన్నారు. 2014 లోనే 80 శాతం పూర్తైన ప్రాజెక్టు.. కేసీఆర్ కుర్చీ వేసుకొని కడ్తనన్న ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆరోపించారు.

 కుర్చీ వేసుకొని కడుతానన్న ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో ఆన్సర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు 80 శాతం ఇరిగేషన్ తో వరి ఉత్పత్తిలో ఉభయ గోదావరి జిల్లాలతో పోటీ పడిన జిల్లా కరీంనగర్ అని గుర్తుచేశారు. సభను తప్పుదోవ పట్టించినట్టు మాట్లాడటం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలను దాటిపోయిందని, కావాలంటే రికార్డులు చెక్ చేసుకోవాలని సూచించారు.