- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్
హైదరాబాద్: తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీలు ఇతర సమస్యలపై ఢిల్లీలో పోరాటానికి.. నేను సిద్ధం.. మరి కేటీఆర్ కూడా సిద్ధమా..? అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. విభజన హామీలపై ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఇద్దరం కలిసి ఆమరణ నిరహార దీక్ష చేద్దాం.. కేటీఆర్ నీవ్వు సిద్ధమా..? తేల్చి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన హామీలు, నిధులపై ఇద్దరం కలిసి మోడీపై యుద్ధం చేద్దాం కేటీఆర్ నీవ్వు సిద్దమా.. చిత్తశుద్ధి ఉంటే సవాల్ ను అంగీకరించి ముందుకు రావాలని రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ 2013 విభజన చట్టంలో పొందుపర్చిన విభజన హామీలనూ రద్దు చేసే అధికారం మోడీకి ఎవరు ఇచ్చారని మండిపడ్డారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్‌లనూ రద్దు చేస్తే మోడీని కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదు..? అని నిలదీశారు. గల్లీలో బీజేపీతో వైరం.. ఢిల్లీలో దోస్తనా చేస్తారు.. ఈ ఇద్దరు తోడు దొంగలు అని ఆరోపించారు. మోడీ తెలంగాణకు మోసం చేస్తే.. మోడీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు కేసీఆర్ ఎందుకు మద్దతు ఇచ్చారని రేవంత్ రెడ్డి నిలదీశారు. కేసీఆర్, నరేంద్రమోడీ ఇద్దరూ కలిసి యువతను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం అంటే.. మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ప్రశ్నించే గొంతులు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా కేసీఆర్ కుట్రలు చేశారని విమర్శించారు. కేసీఆర్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకొని అన్న జీవన్ రెడ్డికి పట్టం కట్టారు.. ఇప్పుడు జీవన్‌రెడ్డికి తోడుగా చిన్నారెడ్డిని మండలికి పంపించాల్సిన బాధ్యత పట్టభద్రులదేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలనూ మోసం చేసినట్లే జర్నలిస్టులను కూడా కేసీఆర్ మోసం చేశారు. కేసీఆర్ పాలనలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మతం, కులం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుతున్నారు. కేసీఆర్, మోడీ జోడి దేశాన్ని స్వర నాశనం చేసే దాకా నిద్రపోరనే విషయం అందరూ గుర్తించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ఇవి కూడా చదవండి