ఈసారి ఓటేస్తున్నా.. మీరూ వేయండి ప్లీజ్

నేను 17 ఏండ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నా. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా. ఎప్పుడో మా టౌన్ లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఓటు రాయించుకుని అప్పుడొచ్చిన మున్సిపల్ ఎలక్షన్లలో ఓటేశా. తర్వాత చదువు కోసం, జాబ్ కోసం బయటికి రావడంతో ఏ ఎలక్షన్లకూ ఓటేయలేదు. హైదరాబాద్ కు వచ్చాక ఇక్కడా ఓటు రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో ఇన్నేండ్లలోనూ ఓటు గురించి ఆలోచించలేదు. అంత అవసరం ఏముంది? నా ఒక్క ఓటుతో మారేదేం ఉందన్న నిర్లక్ష్యంతో పట్టించుకోలేదు. మన రాజకీయాలు, లీడర్లు, ప్రభుత్వాలను చూశాక వచ్చిన నిరుత్సాహం కూడా దీనికి కారణం. దీంతో ఓటరు లిస్టులో పేరుండీ ఓటేయని 50 శాతం మందితోపాటు అర్హత ఉండి ఓటేయనివారిలో ఒకడిగా ఉండిపోయాను.

పరిస్థితులు నన్ను కుదిపేశాయి..

ఇన్నేండ్ల తర్వాత ఈసారి చూసిన కొన్ని పరిస్థితులు నన్ను చాలా కుదిపేశాయి. లాక్ డౌన్ టైంలో కరోనా టెస్టులు చేయించుకోవడానికి సిటీలో జనం పడిన తిప్పలు, ఒక్క బెడ్డు కోసం కార్పొరేట్, సర్కారు హాస్పిటళ్ల చుట్టూ తిరిగితిరిగి కొంతమంది చచ్చిపోయిన తీరు చాలా ఘోరం అనిపించింది. లాక్ డౌన్ తర్వాత కరెంటు బిల్లుల పేరుతో ప్రభుత్వమే జనాన్ని నిలువునా దోచుకుంది. పేదల కోసం ఎన్నో చేస్తున్నామని చెబుతూ ఇంత దారుణంగా బిల్లులు, పన్నులు వసూలు చేశారు. అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఎలక్షన్ రాగానే మాఫీ చేస్తామంటున్నారు. రెండు నెలల కింద సిటీలో వరదలొచ్చి చిన్న పాప ఓపెన్ నాలాలో కొట్టుకుపోయి చనిపోయింది. హైదరాబాద్ కు అన్నీ మేమే చేశామని చెప్పుకునేవాళ్లేగానీ ఇంత ఘోరానికి బాధ్యత తీసుకున్నవాడు ఒక్కడూ నాకు కనబడలేదు. మళ్లీ నెలరోజులకే అంతకన్నా పెద్ద వరదలొచ్చి సిటీలో చాలా వరకు మునిగిపోయింది. 40 మంది దాకా చచ్చిపోయారు.

ఎవరు ఏం చెప్పారో గుర్తుంది..

తెలంగాణ వచ్చాక హైదరాబాద్ కు ఏమేం చేస్తామని ఎవరెవరు ఏం చెప్పారో నాకు బాగా గుర్తుంది. అందుకే వరదల్లో కొట్టుకుపోతున్న మనుషుల్ని టీవీల్లో చూశాక కడుపు మండిపోయింది. అది మరిచిపోకముందే వరద బాధితులకు సాయం పేరుతో లీడర్లు వ్యవహరించిన తీరు ఇంకా ఆవేదన కలిగించింది. శవాల దగ్గర చిల్లర ఏరుకున్నట్లుగా వందల కోట్ల రూపాయలు తినేసి అందరికీ ఇచ్చేశామని బుకాయించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటనల్లో దేనికీ నేను బాధితుణ్ని కాదు. కానీ నా కళ్ల ముందు, తెలిసినవాళ్లకు ఎదురైన అనుభవాలే నా బాధ్యతను నాకు గుర్తుచేశాయి. సిటీలో ఉండే కోట్ల మందిలో ఒకడిగా ఈ నగరం మంచిచెడుల్లో నాకూ భాగం ఉందనిపించింది. అందుకే ఓటరు లిస్టులో రిజిస్టర్ చేయించుకున్నాను. అది రిజిస్టర్ అయ్యే టైంకే ఊహించనంత వేగంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు నేను మన సిటీ ఓటర్ ని. ఇన్నేండ్లు వాడుకోని హక్కును మళ్లీ సంపాదించుకున్నా. దీన్ని ఉపయోగించుకోవడం బాధ్యత అనుకుంటున్నా. అందుకే డిసెంబర్ 1న కచ్చితంగా ఓటేస్తున్నా. నాలాగే ఇన్నేండ్లుగా ఓటేయకుండా ఉన్నవాళ్ల కోసమే ఈ విషయం పంచుకోవాలనిపించి చెబుతున్నా. పాలకులు మారతారా లేదా అన్నది కాదు సిటీ మారడం కోసం మనమంతా ఓటేయడం అవసరం అనిపించింది. అందుకే ఇప్పుడైనా ఓటేద్దాం. సిటీలో మనం కూడా భాగమని నిరూపించుకుందాం. ఎవరు గెలిచినా సరే మన కోసం పనిచేయకపోతే అడిగే హక్కును కూడా సంపాదించుకుందాం. – కె.ఎం.కృష్ణ(ఎంఏ, ఎల్ఎల్​బీ) ఖైరతాబాద్, హైదరాబాద్.