
- తన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని వెల్లడి
- హైదరాబాద్లో చదువుకోనని కూతురు చెప్పడంతో మనస్తాపం
కూకట్పల్లి, వెలుగు: తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని ప్రముఖ సింగర్ కల్పన స్పష్టం చేశారు. నిద్రమాత్రలు అతిగా వాడడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లానని ఆమె తెలిపారు. బుధవారం (మార్చి5) కేపీహెచ్బీ పోలీసులకు ఈ మేరకు ఆమె వాంగ్మూలం ఇచ్చారు. తన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవన్నారు. హైదరాబాద్ నిజాంపేట రోడ్డులోని ఒక విల్లాలో తన భర్త ప్రసాద్ ప్రభాకర్తో కలిసి కల్పన ఉంటున్నారు.
ప్రసాద్ ప్రభాకర్ ఆమెకు రెండో భర్త. మొదటి భర్త నుంచి గతంలోనే విడాకులు తీసుకున్నారు. కల్పన పెద్ద కూతురు దయ కేరళలో నివసిస్తున్నది. ఇటీవల కల్పన కేరళలోని తన కూతురు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కూతురుని హైదరాబాద్లో చదువుకోవాలని కోరగా అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కల్పన మనస్తాపానికి గురయ్యారు. తర్వాత ఈ నెల 4న మధ్యాహ్నం కల్పన కేరళ నుంచి సిటీకి తిరిగి వచ్చారు. రెండ్రోజుల కింద భర్త బిజినెస్ పని మీద చెన్నైకి వెళ్లాడు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె నిద్ర కోసం 8 మాత్రలు వేసుకున్నారు. అయినా నిద్రరాకపోవడంతో మరో 10 మాత్రలు వేసుకున్నారు. రోజూ నిద్రమాత్రలు వేసుకునే తాను ఆ రోజు ఎక్కువగా వేసుకోవటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లానని, ఆ తర్వాత ఏమి జరిగిందో తనకు తెలియదని కల్పన తన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కాగా.. మంగళవారం మధ్యాహ్నం కల్పన భర్త ప్రసాద్ ఆమెకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చెయ్యకపోవడంతో కాలనీవాసులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకు చెప్పడంతో కల్పన ఇంటికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోపలకి ప్రవేశించారు.
అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. కేరళ నుంచి వచ్చిన ఆమె కూతురు దయ బుధవారం తల్లిని పరామర్శించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన తల్లి ఆత్మహత్యాయత్నం చేయలేదని, నిద్ర కోసం ఎక్కువగా నిద్ర మాత్రలు వేసుకోవటం వల్లనే ఇలా జరిగిందని తెలిపింది.