దండాలు పెట్టుకుంటూ తిరిగే వారికే టీఆర్ఎస్ లో గుర్తింపుంటుంది : బూర నర్సయ్య

 చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ నాయకుడు బూర నర్సయ్య గౌడ్... టీఆర్ఎస్ లో వ్యక్తిగత విలువలు లేకనే పార్టీ మారానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో వివిధ సామాజిక వర్గాల వారికి వ్యక్తిగత విలువలు లేవని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మగౌరవం చంపుకుని దండం పెట్టుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. దండాలు పెట్టుకుంటూ తిరిగే వారికే టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఉంటుందన్న ఆయన... బీజేపీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని బూర నర్సయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాతనే కేసిఆర్ గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించాడని తెలిపారు. గతంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటుందని ఆరోపించారు. దళితుల కుటుంబాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని డిమాండ్ చేశారు.