జనగామ, వెలుగు : ‘చిల్లర మల్లర రాజకీయాలు..కుప్పిగంతులు ఇక్కడ సాగయ్..గతంలోనే సీఎం కేసీఆర్ఫోన్ చేసి బాజాప్తా క్లారిటీ ఇచ్చిండు. మళ్లీ జనగామ బరిలో ఉండేది నేనే’ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం శివారు భ్రమరాంబ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన బీసీలకు రూ.లక్ష సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
అంతకుముందు ఎమ్మెల్యే టికెట్మార్పు ప్రచారం పై స్పందించారు. గతంలో పోచంపల్లికి టికెట్అంటూ దుష్ప్రచారం చేస్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలోనే సీఎం కేసీఆర్ పూర్తి క్లారిటీ ఇచ్చారన్నారు. టికెట్ల ప్రకటన జాబితాలో తన పేరు ఏనాడో ఖాయమై పోయిందన్నారు. గెలిచే స్థానాల్లో జనగామ టాప్ టెన్‌లో ఉన్నట్లు సర్వేల్లో తేలిందన్నారు. అటువంటి క్రమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇక్కడి టికెట్ఆశిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ముమ్మాటికీ అసత్యమన్నారు. ఈ తప్పుడు ప్రచారం పై పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా తనకు ఫోన్ చేసి వాటిని నమ్మవద్దని, జనగామకు తాను రావడం లేదని, దుష్ప్రచారం చేసిన జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డిని హెచ్చరించినట్లు చెప్పాడన్నారు.
ALSO READ:ఓరుగల్లులో నాలాల ఆక్రమణలపై.. సర్కారు యూటర్న్!
పల్లా ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా మరో నాలుగేండ్ల వరకు ఉందన్నారు. తన బిడ్డ తుల్జా భవాని ఆరోపణల వెనక మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఉన్నాడన్నారు. కొమ్మూరి కొడుకు, తన అల్లుడు దోస్తులు కావడంతో వెనకుండి కుట్రలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని విషయాలు సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, జడ్పీటీసీలు నిమ్మతి దీపిక, ముద్దసాని పద్మజారెడ్డి పాల్గొన్నారు.