అహ్మదాబాద్: వయసు మీద పడ్డ ప్లేయర్లు, అనుభవం లేని యంగ్‌స్టర్స్‌తో అద్భుతం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో సీఎస్కే జట్టును ఐదోసారి విజేతగా నిలిపాడు. 16వ సీజన్ లీగ్ దశలో పడుతూ లేస్తూ సాగిన టీమ్‌ను తన మాస్టర్ మైండ్‌తో గమ్యానికి చేర్చిన మహీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. ఐపీఎల్‌లో తాను మరో సీజన్ ఆడే అవకాశం ఉందన్నాడు. ఫ్యాన్స్ తనపై చూపించిన ప్రేమ వెలకట్టలేనిదని, వారికి కృతజ్ఞతగా మరో సీజన్ ఆడే ప్రయత్నం చేస్తానని తెలిపాడు. అయితే, అందుకు తన శరీరం సహకరిస్తుందో లేదో చూడాలన్నాడు. 41 ఏండ్ల ధోనీ కెప్టెన్సీలో సోమవారం రాత్రి జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన సీఎస్కే ఐదోసారి విజేతగా నిలిచింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కాస్త భావోద్వేగానికి గురైన మహీ ఐపీఎల్‌లో తన ఫ్యూచర్ గురించి మాట్లాడాడు. ‘ట్రోఫీ నెగ్గిన నేపథ్యంలో నా రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే మంచి సమయం అనొచ్చు. ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెబుతూ ఇప్పుడే ఆట ముగించడం ఈజీనే. కానీ, తొమ్మిది నెలలు కష్టపడి ఇంకో సీజన్ ఆడటానికి ప్రయత్నించడం చాలా కష్టమైన పని అవుతుంది. నా బాడీని ఆటకు రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. అయితే, సీఎస్కే అభిమానుల నుంచి ఇంత ప్రేమను అందుకున్న తర్వాత మరో సీజన్ ఆడితే నా నుంచి వారికి ఓ గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అందుకోసం ప్రయత్నించాలనిపిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఆరేడు నెలల సమయం ఉంది’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.
ఎమోషనల్ అయ్యా
ఈ సీజన్‌లో చెన్నై ఆడిన ప్రతీ మ్యాచ్‌ల్లో ఫ్యాన్స్ ధోనీ జపం చేశారు. ప్రతీ స్టేడియం ఎల్లో జెర్సీలతో నిండిపోయింది. వాళ్ల అభిమానాన్ని చూసి తాను ఎమోషనల్ అయ్యానని మహీ తెలిపాడు. ‘ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఇక్కడే (అహ్మదాబాద్) ఆడాను. స్టేడియంలోని ప్రతి ఒక్కరూ నా పేరే పలకడంతో కండ్లలో నీళ్లు తిరిగాయి. డగౌట్ నుంచి బయటికి వచ్చేందుకు కొంత సమయం పట్టింది. వారు నాపై ప్రేమ చూపిస్తున్నారని, ఒదిగి ఉండే నా స్వభావాన్ని ఇష్టపడతారని నాకు తెలుసు. కాబట్టి వారి ప్రేమను ఆస్వాదించాలని నిర్ణయించుకున్నా’ అని మహీ తెలిపాడు. తనకు ప్రతీ ట్రోఫీ ప్రత్యేకమే అన్న ధోనీ ప్రతీ మ్యాచ్‌లో సవాళ్లు ఛేదించేందుకు సిద్ధంగా ఉండటం ముఖ్యమన్నాడు. ఫైనల్లోనూ తమ బౌలింగ్ తడబడినా బ్యాటర్లు రాణించడంతో విజయం సాధ్యమైందన్నాడు.
రాయుడు.. స్పెషల్
కెరీర్‌లో ఆఖరాట ఆడిన అంబటి రాయుడుపై ధోనీ ప్రశంసలు కురిపించాడు. ప్రెజెంటేషన్ సెర్మనీలో ట్రోఫీ అందుకునేందుకు తన బదులు రాయుడును పంపించాడు. ‘రాయుడు స్పెషాలిటీ ఏంటంటే ఫీల్డ్‌లో ఎల్లప్పుడూ తన వంద శాతం ఇస్తాడు. ఇండియా– ఎ టూర్స్‌లో ఆడినప్పటి నుంచి తను నాకు తెలుసు. అతనితో చాలా కాలంగా ఆడుతున్నా. పేస్, స్పిన్ రెండింటినీ సమానంగా ఆడే సత్తా ఉన్న ఆటగాడు రాయుడు. అది స్పెషల్ టాలెంట్. ఈరోజు కూడా అతను ఏదైనా ప్రత్యేకంగా చేస్తాడని నేను భావించా. అనుకున్నట్టే కీలక ఇన్నింగ్స్ ఆడాడు’ అని ధోనీ మెచ్చుకున్నాడు.