పాక్‎తో యుద్ధం వద్దని నేను అనలేదు.. సీఎం సిద్ధరామయ్య క్లారిటీ

పాక్‎తో యుద్ధం వద్దని నేను అనలేదు.. సీఎం సిద్ధరామయ్య క్లారిటీ

బెంగళూరు: పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్తాన్‎పై యుద్ధం వద్దని తాను అనలేదని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య తెలిపారు. అనివార్యమైతేనే యుద్ధం జగాలని, ఈ సమస్యకు అది పరిష్కార మార్గం కాదని తాను అన్నట్టు క్లారిటీ ఇచ్చారు. ‘పాకిస్తాన్​తో యుద్ధం వద్దు’ అంటూ సిద్ధ రామయ్య ఇటీవల చేసిన కామెంట్స్​పాకిస్తాన్​ మీడియాలో ప్రసారం అయ్యాయి. దీంతో ఆయనపై బీజేపీ శ్రేణులు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధ రామయ్య తన వ్యాఖ్యలపై ఆదివారం మీడియా ఎదుట వివరణ ఇచ్చారు.

ఈ వీడియోను ‘ఎక్స్​’ లో పోస్ట్​ చేశారు. ‘‘ఇప్పుడు యుద్ధం అవసరం లేదు అంటే.. అనివార్యమైతేనే జరగాలి. యుద్ధం ఒక్కటే పరిష్కార మార్గం కాదు. యుద్ధం కోసం వచ్చిన డిమాండ్లను నేను తప్పుపట్టలేదు” అని అన్నారు. అవసరమైతే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాకిస్తాన్‎కు గట్టిగా బుద్ధిచెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ట్వీట్​ చేశారు.

నిఘా వైఫల్యం వల్లే ఉగ్రదాడి

పహల్గాం వద్ద పర్యాటకులకు భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వ విధి అని సిద్ధ రామయ్య అన్నారు. ఈ విషయంలో లోపాలు జరిగాయని, ఈ దాడిని నివారించడంలో నిఘా విభాగం విఫలమైందని తెలిపారు.

సిద్ధ రామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్​

పాక్‎తో యుద్ధాన్ని భారత్‎లోనే కొందరు వ్యతిరేకిస్తున్నారంటూ సిద్ధరామయ్య వ్యాఖ్యలు అక్కడి మీడియాలో ప్రసారం కాగా.. బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. సరిహద్దులో యుద్ధ ముప్పు పొంచి ఉన్న సమయంలో.. సిద్ధరామయ్య శత్రు దేశానికి కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని కర్నాటక శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్.అశోక ఫైర్​ అయ్యారు. పాక్​ సర్కారు సిద్ధరామయ్యకు అత్యున్నత పౌరపురస్కారం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.