న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తాను తప్పించలేదని బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ వన్డే, టెస్టు నాయకుడిగా కొనసాగాలని అనుకున్నాడు. కానీ, గంగూలీతో విభేదాల కారణంగానే అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ వదులుకోవాల్సి వచ్చిందని అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఈ విషయంపై దాదా మరోసారి స్పష్టత ఇచ్చాడు. ‘నేను విరాట్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించలేదు. కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదులుకోవాలని డిసైడయ్యాడు.
అప్పుడు నువ్వు టీ20 కెప్టెన్సీ వద్దనుకుంటే మొత్తం వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిదని చెప్పా. వైట్ బాల్‌కు ఓ కెప్టెన్, టెస్టు ఫార్మాట్‌కు మరో కెప్టెన్ ఉంటే బాగుంటుందని సూచించా’ అని ఓ రియాలిటీ షోలో స్పష్టం చేశాడు. కోహ్లీ దిగిపోయిన తర్వాత మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉండటానికి రోహిత్ శర్మ ఇష్టపడలేదన్నాడు. దాంతో తాను చొరవ తీసుకొని రోహిత్‌ను ఒప్పించానని తెలిపాడు. హిట్‌మ్యాన్ పగ్గాలు అందుకునే విషయంలో సాయం చేశానని వెల్లడించాడు.