తనకు చావంటే భయం లేదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. నిన్న యూపీలోని మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా తన కారుపై కాల్పులు జరిగిన ఘటనపై ఆయన ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. చావంటే భయం లేదని, తనకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కర్లేదని, దానిని తాను తిరస్కరిస్తున్నానని అసద్ తెలిపారు. తనను ‘ఏ’ కేటగిరీ పౌరుడిగానే ఉంచాలని కోరారు. యూపీలో జరిగిన ఘటనపై తాను సైలెంట్‌గా ఉండబోనని, తనకు న్యాయం చేయాలని కోరారు. కాల్పులు జరిపిన నిందితులపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రయోగించే ఉపా చట్టం కింద కేసులు పెట్టాలని అన్నారు. విద్వేషాన్ని, తీవ్రవాదానికి ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వాని విజ్ఞప్తి చేశారు అసదుద్దీన్ ఒవైసీ.
I don't fear death. I don't want Z category security, I reject it; make me an 'A' category citizen. I'll not remain silent. Please do justice...charge them (shooters) with UAPA...appeal govt to end hate, radicalization: AIMIM MP Asaduddin Owaisi over attack on his vehicle in UP pic.twitter.com/mYRBeot37u
— ANI (@ANI) February 4, 2022
దాడి తర్వాత జడ్ కేటగిరీ సెక్యూరిటీ
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు అసదుద్దీన్ ఒవైసీ నిన్న మీరట్‌లో పర్యటించారు. అయితే ప్రచారాన్ని ముగించుకుని, తిరిగి ఢిల్లీ వెళ్తుండగా ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద గుర్తు తెలియని దుండగులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సురక్షితంగా బయటపడిన ఆయన మరో వెహికల్‌లో ఢిల్లీ చేరుకున్నారు. ఈ దాడి చేసిన నలుగురు దుండగుల్లో ఒకరిని అప్పుడే పట్టుకున్నారు. మిగతా వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఈ ఘటన తర్వాత ఒవైసీ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆయనకు సీఎంలు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల ముప్పు ఉన్న ప్రముఖ నేతలకు కేటాయించే జడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సెక్యూరిటీని తాను తిరస్కరిస్తున్నట్లు అసద్ ఇవాళ పార్లమెంట్‌లో ప్రకటించారు.