హైదరాబాద్: తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. సమాచారం ఉన్నా.. లేకపోయినా ఎంక్వైరీకి రావాల్సిందే అని ఈడీ ఆఫీసర్లు తేల్చి చెప్పడంతో ఆయన బషీర్ బాగ్ లోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసుకు వచ్చారు. ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు మీడియాతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడారు. తనను ఏ కేసులో విచారణకు పిలిచారో కూడా తెలియదని స్పష్టం చేశారు.
వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేనని, కొంత సమయం ఇవ్వాలని ఈడీని కోరానన్నారు. అయితే ఈడీ అధికారులు కుదరదని చెప్పడంతో విచారణకు వచ్చానని రోహిత్ చెప్పుకొచ్చారు. ఈడీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఈడీ అధికారుల ఎదుటకు వెళ్లాకే కేసు ఏమిటనేది తెలుస్తుందన్నారు. తనకు ఏ కేసులతోనూ సంబంధం లేదని, ఏ వివరాలు అడిగినా తనకు తెలిసినవి చెబుతానని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చెప్పారు. రోహిత్ తనతో పాటు ఆస్తి పత్రాలు, బ్యాంక్ స్టేట్ మెంట్ వివరాలను ఈడీకి సమర్పించేందుకు తీసుకెళ్లినట్లు సమాచారం.