పంత్‌ ఇప్పట్లో రాడు.. వచ్చే ఐపీఎల్ నాటికీ కష్టమే: భారత మాజీ బౌలర్

పంత్‌ ఇప్పట్లో రాడు.. వచ్చే ఐపీఎల్ నాటికీ కష్టమే: భారత మాజీ బౌలర్

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ గాయాల నుంచి పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఉంటూ వీలైనంత త్వరగా జట్టులో చేరడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. బ్యాటింగ్‌ సాధనతో పాటు వికెట్‌ కీపింగ్‌ కూడా మొదలు పెట్టారు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా వెల్లడించింది. 

ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే టీమిండియా వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ మరో బాంబ్ పేల్చారు. పంత్ పునరాగమనంపై స్పందించిన ఈ వెటరన్ బౌలర్.. అతని గాయం చిన్నది కాదని, జట్టులో చేరడానికి మరింత సమయం పడుతుందని తెలిపారు. వచ్చే ఐపీఎల్ నాటికి కూడా అతను కోలుకోకపోవచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

"రిషబ్ పంత్‌ను వచ్చే ఐపీఎల్ నాటికి కూడాజట్టులో చూడలేమని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అతని గాయం చిన్నది కాదు. చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడే బ్యాటింగ్, వికెట్ కీపింగ్ మొదలుపెట్టారు. రోజుల వ్యవధిలో తిరిగి జట్టులో చేరడమంటే సాధ్యమయ్యేది కాదు. అందునా వికెట్ కీపర్, బ్యాటర్‌ అయిన పంత్‌కు మరింత కష్టం."

"ఇక్కడ మంచి విషయం ఏమిటంటే అతనికి రెండవ శస్త్రచికిత్స అవసరం కాలేదు. రెండోసారి సర్జరీ జరిగితే కోలుకోవడానికి మరింత సమయం పట్టేది. వరల్డ్ కప్‌ నాటికి పంత్ ఫిట్‌గా ఉంటాడని నేను అనుకోను. అతను వచ్చే ఐపిఎల్‌ నాటికి కోలుకున్నా అది గొప్పే అవుతుంది.." అని జియో సినిమాలో ఇషాంత్ చెప్పుకొచ్చారు.

రిషబ్ పంత్ వేగంగా కోలుకోవాలని.. వీలైనంత త్వరగా జట్టులో చేరాలని ఆశించని భారత అభిమాని లేరు. ఇలాంటి సమయంలో ఇషాంత్ శర్మ వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.