నాకేం యాదికి లేదు.. విచారణలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ సమాధానాలు

నాకేం యాదికి లేదు.. విచారణలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ సమాధానాలు
  • డీపీఆర్‌లపై రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ సమాధానం
  • పుస్తకాలు చదవండి.. డ్రైఫ్రూట్స్ తినండని జస్టిస్ ఘోష్ సెటైర్
  •  ప్రభుత్వమంటే ఎవరు అని ప్రశ్నించిన కమిషన్​
  • సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీలంటూ సమాధానం
  • రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేదా అంటూ కమిషన్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎంక్వైరీలో భాగంగా హాజరైన రిటైర్డ్ ఈఎన్‌సీ మురళీధర్​.. తనకు ఇటీవలి కాలంలో మతిమరుపు పెరుగుతున్నదని, జ్ఞాపకశక్తి మందగిస్తున్నదని కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్​కు వివరించారు. 2015 జనవరి 21న ఇచ్చిన జీవో 28లోని నాలుగో పేరాలో ‘డీపీఆర్​’లు అని మెన్షన్ చేశారు కదా.. ఏ డీపీఆర్​ల ఆధారంగా పనుల్లో ముందుకు వెళ్లారని కమిషన్ ప్రశ్నించిన సందర్భంలో తనకు గుర్తు లేదని ఆయన బదులిచ్చారు. 

చాలా ప్రశ్నలకు ఆయన ఇలాంటి సమాధానాలే ఇవ్వడంతో.. ఏజ్​ పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి మందగించడం సహజమేనని, మరి జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఏమీ చేయట్లేదా అని సరదాగా ప్రశ్నించారు. అయితే తాను న్యూస్​పేపర్లు చదువుతుంటానని మురళీధర్ చెప్పడంతో.. న్యూస్​పేపర్లు కాదు పుస్తకాలు చదవాలని సరదాగా వ్యాఖ్యానించారు. పండ్లు, డ్రైఫ్రూట్స్ మంచిగా తినాలని సూచించారు. వన్, టూ, త్రీ అంటూ అంకెలు లెక్కబెట్టుకోవాలని, ఇలాంటివి చేస్తుంటూ మెదడు పనితీరు మెరుగై జ్ఞాపకశక్తి పెరుగుతుందని సలహా ఇచ్చారు.

ప్రభుత్వం అంటే ఎవరు..

ఇదే సందర్భంగా డీపీఆర్​లను తయారు చేసే పనిని వ్యాప్కోస్​కు అప్పగించే నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారని కమిషన్ ప్రశ్నించగా.. ప్రభుత్వమని మురళీధర్ బదులిచ్చారు. ప్రభుత్వం అంటే ఎవరు అని ప్రశ్నించగా.. ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీలు అని మురళీధర్​ చెప్పడంతో కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత పెద్ద పొజిషన్​లో పనిచేసిన మీకు ప్రభుత్వం అంటే ఎవరో తెలియదా అని మండిపడ్డారు. రాజ్యాంగం గురించి కనీస అవగాహన కూడా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వమంటే పాలకులని, సెక్రటరీలంతా అడ్మినిస్ట్రేషన్ అని, రెండు కలిసి పనిచేస్తాయని వివరించారు. అప్పట్లో సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎవరు అని ప్రశ్నించగా.. కేసీఆర్, హరీశ్​రావు అని మురళీధర్ సమాధానమిచ్చారు.