కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు నేను గ్యారంటీ : భట్టి విక్రమార్క

ముదిగొండ, వెలుగు : కాంగ్రెస్  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలకు తానే గ్యారంటీ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్  రెడ్డి ఉచిత కరెంటుపై హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని, అలాగే తాము ఇచ్చిన హమీలను నెరవేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఆదివారం మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం, మల్లన్నపాలెంలో భట్టి ఎన్నికల ప్రచారం చేశారు. పమ్మి, చిరుమర్రి, సువర్ణాపురం, ముదిగొండ, వెంకటాపురం గ్రామాల్లో ప్రచారం కొనసాగించి  గోకినపల్లి గ్రామంలో ముగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రజల కోసం సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇస్తే అదే రాష్ట్ర ప్రజల సంపదను సీఎం కేసీఆర్ దోచుకుతిన్నారని ఫైర్  అయ్యారు. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి, రాష్ట్రం వచ్చాక మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్   చెలగాటం ఆడారని మండిపడ్డారు. ఇక ఆరు గ్యారంటీలు హామీలు అమలు చేయడానికి కావాల్సిన ప్రణాళిక తమ పార్టీ నాయకులకు ఉందని చెప్పారు. 

రాష్ట్ర సంపద ప్రజలందరికీ పంచాలని తమ పార్టీ ఆరు గ్యారంటీల హామీ ఇచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం వస్తే ఎవ్వరిమీదా పక్షపాతం చూపబోమని, కాంగ్రెస్ అంటేనే అందరి ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో తాము సంతకాలు చేసి పంపించిన గ్యారంటీ హామీ పత్రంలో ఉన్న అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ను ఈ ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.