ఆ మూడేండ్లు కష్టంగా గడిచాయి: భారత మిస్టరీ స్పిన్నర్

ఆ మూడేండ్లు కష్టంగా గడిచాయి: భారత మిస్టరీ స్పిన్నర్

గెబేహా: టీమిండియాకు దూరంగా ఉన్న మూడేండ్లు తన జీవితంలో అత్యంత కష్టంగా గడిచాయని మిస్టరీ స్పిన్నర్‌‌‌‌ వరుణ్ చక్రవర్తి చెప్పాడు. ఈ  విరామంలో తన బౌలింగ్‌‌ను పూర్తిగా మార్చుకోవడంతోనే ఇప్పుడు బాగా రాణిస్తున్నానని తెలిపాడు. సౌతాఫ్రికాతో రెండో టీ20లో ఇండియా ఓడినా ఐదు వికెట్లతో వరుణ్‌‌ కెరీర్ బెస్ట్ బౌలింగ్‌‌ సాధించాడు. ఈ మ్యాచ్ తర్వాత మాట్లాడిన వరుణ్‌‌ నేషనల్ టీమ్‌‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తన బౌలింగ్‌‌లో చేసిన మార్పుల గురించి వివరించాడు. 

‘ఇండియా టీమ్‌‌కు దూరమైన తర్వాత  ఇంట్లో కూర్చొని  నా బౌలింగ్‌‌ వీడియోలన్నీ పరిశీలించా. నేను ఎక్కువగా సైడ్ స్పిన్‌‌ వేస్తున్నానని, అత్యుత్తమ స్థాయి ఆటలో అది సరిగ్గా పని చేయడం లేదని గుర్తించా. దాంతో నా బౌలింగ్‌‌ను పూర్తిగా మార్చుకున్నా. ఇందుకు రెండేండ్లు పట్టింది. నా బౌలింగ్‌‌లో మార్పులు చేసుకొని  తొలుత లోకల్ లీగ్స్‌‌లో పాల్గొన్నా. ఆ తర్వాత ఐపీఎల్‌‌లో ఆడాను. అక్కడ మెరుగైన ఫలితాలు రావడం మొదలైంది. దాంతో ఇంటర్నేషనల్ స్టేజ్‌‌లోనూ దాన్ని ట్రై చేసి ఫలితం  రాబడుతున్నా’ అని చక్రవర్తి చెప్పుకొచ్చాడు. 

ఐపీఎల్‌‌లో  కేకేఆర్‌‌‌‌కు ఆడుతున్న వరుణ్ చక్రవర్తి..  ఆ టీమ్ మాజీ మెంటార్‌‌‌‌, టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌ గౌతమ్ గంభీర్‌‌‌‌ తాను తిరిగి ఫామ్‌‌ అందుకునేందుకు సాయం చేశాడని చెప్పాడు.‘బంగ్లాదేశ్‌‌ టూర్‌‌‌‌ సందర్భంగా గంభీర్‌‌, నేను చాలా చర్చించుకున్నాం. జట్టులో నా పాత్ర ఏమిటనే విషయాన్ని ఆయన నాకు స్పష్టంగా తెలిపారు. నేను 30–40 రన్స్ ఇచ్చినా సరే వికెట్లు తీయడం ముఖ్యమని చెప్పారు. జట్టులో నా పాత్ర అదే అన్నారు. గంభీర్ ఇచ్చిన  స్పష్టత  నాకు కచ్చితంగా ఉపయోగపడింది’ అని వరుణ్ పేర్కొన్నాడు.