Hardik Pandya: అభిమానులు నా ప్రాణం.. వారి కోసమే ఆడతా..: సెంటిమెంట్‌తో పడేసిన పాండ్యా

Hardik Pandya: అభిమానులు నా ప్రాణం.. వారి కోసమే ఆడతా..: సెంటిమెంట్‌తో పడేసిన పాండ్యా

పూణే గడ్డపై టీమిండియా విజయాన్ని పక్కనపెడితే.. గెలుపు కోసం మనోళ్లు పోరాడిన తీరు అద్భుతమని చెప్పుకోవాలి. పడి లేచిన కెరటంలా విజృంభించారు. 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశనుండి కోలుకొని.. ప్రత్యర్థి ఎదుట 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడమే ఓ గొప్ప. దానికి తోడు ఛేదనలో 5 ఓవర్లకే 53 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తున్న ఇంగ్లండ్‌ను బోల్తా కొట్టించి మ్యాచ్ వశం చేసుకోవడమం మనోళ్ల పోరాటానికి అద్దం పడుతోంది. ఈ మ్యాచ్ హీరో.. జట్టులో పెద్దన్న పాత్ర పోషించే పాండ్యనే.

ఒకే ఓవర్లో మూడు వికెట్లు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. 2 ఓవర్లు ముగిసేసరికి 12 పరుగులకు 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ సాకిబ్ మహమూద్.. ఒకే ఓవర్‌లో ఇండియాను దెబ్బతీశాడు. రెండో ఓవర్ వేసిన ఈ ఇంగ్లీష్ పేసర్.. బంతుల వ్యవధిలో సంజూ శాంసన్(1), తిలక్ వర్మ(0), సూర్యకుమార్ యాదవ్(0) పెవిలియన్ చేర్చాడు. ఆ సమయంలో హార్దిక్(30 బంతుల్లో 53, 4 ఫోర్లు, 4 సిక్సర్లు).. శివమ్‌ దూబె (34 బంతుల్లో 53, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి జట్టును ఒడ్డున పడేశాడు. 

ALSO READ | SL vs AUS: సొంతగడ్డపై తేలిపోయిన లంకేయులు.. టెస్టులో అతి పెద్ద ఓటమి

ఈ ప్రదర్శన పట్ల స్పంచించిన పాండ్యా.. అభిమానుల కోసం తానెప్పుడూ ఆడతానని, వారే తన ప్రాణమని చెప్పుకొచ్చాడు. కోట్లాది భారత అభిమానులు తనలో ఆ అదనపు ప్రేరణ నింపారని సెంటిమెంట్‌ పేల్చాడు.

"నేనెప్పుడూ అభిమానుల కోసం ఆడే వ్యక్తిని. మ్యాచ్ వీక్షించడానికి స్టేడియానికి వచ్చే అభిమానుల అరుపులు నాలో అదనపు ఉత్తేజాన్ని నింపుతాయి. ఇవి నోటితో చెప్తున్న మాటలు కాదు.. గుండెల్లో నుంచి వస్తున్న నిజాలు. వారికోసం ఎల్లప్పుడూ ఆడాలనుకుంటాను.." అని పాండ్యా BCCI విడుదల చేసిన వీడియోలో చెప్పాడు.

అతని మాటల్లో వాస్తవం లేకపోలేదు. జట్టు పరిస్థితులు అర్థం చేసుకొని ఆడటం అతని నైజం. అభిమానులకు అవేమి పట్టవు. 20 బంతుల్లో 50, 30 బంతుల్లో వంద కొడితే ఒకే. లేదంటే వర్ణించలేని విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతుంటారు. జట్టు ఓటమిపాలైన ప్రతిసారి అతన్నే బాధ్యుణ్ణి చేస్తుంటారు.