నాకు హైపర్ థైరాయిడిజం.. రెండు నెలల్లో 10 కిలోల బరువు కోల్పోయా..: పాక్ ఓపెనర్

నాకు హైపర్ థైరాయిడిజం.. రెండు నెలల్లో 10 కిలోల బరువు కోల్పోయా..: పాక్ ఓపెనర్

పాకిస్తాన్ వెటరన్ బ్యాటర్, ఓపెనర్ ఫఖర్ జమాన్ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. తాను హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధపడుతున్నాని.. కేవలం రెండు నెలల కాలంలో 10 కిలోల బరువు కోల్పోయానని చెప్పుకొచ్చాడు. దీనివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వెల్లడించాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె కొట్టుకునే వేగం పెరిగిందని తెలిపాడు. ఒక దశలో తాను ప్రాణం మీద ఆశలు వదులుకున్నానని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో సభ్యుడు

ఈ నెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. ఆ జట్టులో ఫఖర్ జమాన్ సభ్యుడు. ఈ క్రమంలో సౌత్ పా తన రీ-ఎంట్రీపై పీసీబీ పాడ్‌కాస్ట్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇన్నాళ్లు జట్టుకు దూరంగా ఉండటానికి తన ఆరోగ్య సమస్యలే కారణమని ఫఖర్ స్పష్టం చేశాడు. అయినప్పటికీ, తాను నమ్మకం కోల్పోకుండా అవకాశమొచ్చిన ప్రతి సారి మైదానంలోకి దిగానని వివరించాడు. ఈ ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో మంచిగా రాణించి జట్టుకు చిరస్మరణీయంగా మార్చడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని మాటిచ్చాడు. 

ALSO READ | Thiago Messi: మరీ టాలెంటెడ్‌లా ఉన్నాడే: ఒకే మ్యాచ్‌లో 11 గోల్స్ కొట్టిన మెస్సీ కొడుకు

2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమి పాలవ్వగా.. ఆ మ్యాచ్‌లో ఫఖర్ సెంచరీ బాదాడు. 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 114 పరుగులు చేశాడు. దాంతో పాక్ 338 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఛేదనలో టీమిండియా 158 పరుగులకే కుప్పకూలింది.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ముక్కోణపు సిరీస్‌ జరగనుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ జట్టు: ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), ఖుష్దిల్ షా, సల్మాన్ అఘా, ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ హస్నైన్, హరీస్ రౌఫ్.