రాజకీయాల్లో నాకు గాడ్ఫాదర్ లేడు : పొంగులేటి

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజకీయాల్లో ఎవరూ గాడ్ ఫాదర్ లేరని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలే తనకు గాడ్ ఫాదర్స్ అని చెప్పారు. ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో రాజుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీని సామ్రాజ్యంగా మార్చుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొందరు చేస్తున్న పనులకు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి  వస్తుందని అన్నారు. రాజకీయాల్లో తానెప్పుడు మౌనంగా లేనని.. గత 9 ఏళ్లుగా నిత్యం ప్రజల్లో ఉంటున్నానని పొంగులేటి స్పష్టం చేశారు.

ఖమ్మంజిల్లా పినపాకలో నిర్వహించన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి పాల్గొన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే పార్టీ మారే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలుగానీ , బీఆర్ఎస్ అనే పదం వాడకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.