అలనాటి అందాల తార, బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకోవడం.. కిన్నెర అఖారా మహామండలేశ్వర్‌గా నియమితువ్వడం.. అది జరిగిన గంటల వ్యవధిలోనే బహిష్కరణకు గురవ్వడం చకచకా జరిగిపోయాయి. ఆమెను కిన్నెర అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రిషి అజయ్ దాస్ రెండు రోజుల క్రితం ప్రకటన చేశారు. మమతా కులకర్ణితో పాటు ఆమెను చేర్పించిన ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠిని సైతం అఖాడా నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ పరిణామాలపై నటి మమతా కులకర్ణి స్పందించారు. మండలేశ్వరుడిగా నియమితులవ్వడానికి తాను డబ్బు చెల్లించినట్లు వస్తున్నఆరోపణలను ఆమె ఖండించారు. ఆర్థిక కష్టాలే తనను సన్యాసం తీసుకునేందుకు ప్రేరేపించాయని తెలిపారు. ఒక మహిళగా సాధారణ జీవితం గడుపుతున్నా.. రూపాయి కూడా తన వద్ద లేవని అన్నారు. ఆ కష్టాలను ఎదుర్కోలేక సన్యాసం తీసుకున్నట్లు వివరించారు.
శిథిలావస్థలో అపార్ట్‌మెంట్లు..
"నేను కోట్ల రూపాయలు ఇచ్చినట్లు మీరంటున్నారు. నా వద్ద రూ. 10 కోట్లు కాదు కదా కోటి రూపాయలు కూడా లేవు. ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. ప్రస్తుతం నేను జీవితాన్ని ఎలా నెట్టుకొస్తున్నానో నాకే తెలియదు. గత 23 ఏళ్లుగా నా మూడు అపార్ట్‌మెంట్లు మూసి ఉంచినందున శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ ప్రాంతాలను చూస్తే చెదలు పట్టి ఉన్నాయి. నేను ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు. దుఃఖం తన్నుకొస్తోంది.." అని మమతా కులకర్ణి కన్నీటి పర్యంతమయ్యారు.
మమత కులకర్ణి తొలినాళ్లలోనే బాలీవుడ్‌ని వదిలేసింది. ఆమె చివరిగా 2002లో విడుదలైన కభీ తుమ్ కభీ హమ్ సినిమాలో కనిపించింది.