కాంగ్రెస్​ డిపాజిట్​ గల్లంతు

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక రూపంలో కాంగ్రెస్‌‌ పార్టీకి మరో ఓటమి ఎదురైంది. హుజుర్‌‌‌‌నగర్‌‌ తర్వాత మరోసారి సిట్టింగ్‌‌ సీటును కోల్పోయింది. దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్‌‌లో మాదిరి మునుగోడులో మూడో స్థానానికి పరిమితమైపోయింది. ఈ బైపోల్‌‌లో 2,25,874 ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్‌‌ డిపాజిట్‌‌ కూడా దక్కించుకోలేకపోయింది. హస్తం అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్ దక్కాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు ఓట్లు (37,646) సంపాదించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్‌‌కు 99,239 ఓట్లు రాగా.. ఇప్పుడు అందులో మూడో వంతు కూడా రాలేదు. పార్టీ కీలక నేతల మధ్య సయోధ్య లేకపోవడం, ఎన్నికల బాధ్యతలను నేతలు సీరియస్‌‌గా తీసుకోకపోవడం వంటి అంశాలు ఓటింగ్‌‌పై ప్రభావాన్ని చూపించాయి. 

స్టార్ క్యాంపెయినర్‌‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచారానికి దూరంగా ఉండడం కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితికి కారణమైంది. రాహుల్ యాత్ర ఎన్నికల ప్రచారంపై ఎఫెక్ట్ చూపించింది. ఒకవైపు యాత్రలో పాల్గొనడం, మరోవైపు ప్రచారంలో పాల్గొనడం నేతలకు ఇబ్బందిగా మారింది. స్రవంతి ఒంటరి పోరాటం చేసినా అనేక ప్రతికూల పరిస్థితులతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయిన బీజేపీ రెండో స్థానంలోకి వచ్చింది.

నానాటికీ తీసికట్టు

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకూ దిగజారుతూ వస్తున్నది. క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతూ ఓటు బ్యాంకును దూరం చేసుకుంటున్నది. మూడేండ్లలో జరిగిన ఎలక్షన్లను పరిగణనలోకి తీసుకుని ఓట్ల శాతాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 28.43 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్.. లోక్‌సభ ఎలక్షన్లలో 29.48 శాతానికి పెంచుకుంది. తర్వాతి నుంచి పడుతూ వస్తున్నది. సిట్టింగ్ సీటు హుజూర్‌‌నగర్‌‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు జరిగిన బైపోల్‌లో ఓడిపోయింది. రెండో స్థానానికి పరిమితమైంది. దుబ్బాక బై పోల్‌లో 13.48 శాతం ఓట్లే పడ్డాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. కేవలం 6.64 శాతం ఓట్లు వచ్చాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ ఇవ్వలేకపోయింది. నాగార్జున సాగర్‌‌లో 2018 ఎన్నికల్లో 42.04 శాతం ఓట్లు వస్తే.. బైపోల్‌లో 37.16 శాతానికి పడిపోయింది. ఇక హుజూరాబాద్‌లో డిపాజిట్ కూడా రాలేదు.

ఓటమిలోనూ ఉపశమనం

పీసీసీ చీఫ్‌గా రేవంత్​కు ఇది వరుసగా రెండో ఓటమి. హుజూరాబాద్ బైపోల్​లో కాంగ్రెస్ అభ్యర్థికి 3,014 ఓట్లే పడ్డాయి. డిపాజిట్ దక్కలేదు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురైనప్పటికీ.. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో 23 వేలకు పైగా ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌కు ఇది భారీ ఓటమే అయినా.. రాజగోపాల్‌ గెలవకపోవడం రేవంత్‌ వర్గానికి ఉపశమనం కలిగించే అంశమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌.. మునుగోడులో గెలిచి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని భావించారని, ఒకవేళ అదే జరిగితే రేవంత్‌కు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవని అంటున్నారు.