న్యూఢిల్లీ : మిడిలార్డర్‌లో ఏ బ్యాటర్‌కు ప్రత్యేకంగా ప్లేస్ లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. పరిస్థితిని బట్టి ఎవరు ఎక్కడైనా ఆడేందుకు రెడీగా ఉండాలని సూచించాడు. ‘ఓపెనర్ల నుంచి మొదలుకొని టీమ్‌లో ప్రతి ఒక్కరి పాత్ర ఏంటో అందరికీ తెలుసు. అయితే మిడిలార్డర్‌లో కాస్త వెసులుబాటు ఉండాలని కోరుకుంటున్నాం. పరిస్థితిని బట్టి బ్యాటింగ్ ప్లేస్‌లు మారుతాయి.
దానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉండాలి. ప్రతి ప్లేయర్ నుంచి టీమ్ ఏం ఆశిస్తుందో ముందుగానే చెప్పాం. క్రికెట్‌లో భిన్నమైన సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించగలిగితే మరో స్థాయికి ఎదగొచ్చు. ఇంటర్నేషనల్ కెరీర్ ముందుకు సాగాలంటే ఏ పొజిషన్‌లోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి.
గతంలో టీమిండియాలో ఏం జరిగిందో అజిత్‌కు తెలియదు. అందుకే నేను వీలైనంత వరకు అప్‌డేట్స్ ఇచ్చా. దాని ప్రకారమే టీమ్ ఎంపిక జరిగింది’ అని రోహిత్ పేర్కొన్నాడు. ఇక టీమ్‌లో చోటు దక్కని ప్లేయర్లకు ద్వారాలు మూసుకుపోయినట్లు కాదన్నాడు. ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా చాన్స్ వస్తుందని గుర్తు చేశాడు. వరల్డ్ కప్ టైమ్ వరకు టీమ్‌లో మరికొన్ని మార్పులు ఉంటాయని కెప్టెన్ సంకేతాలిచ్చాడు.