టాలెంట్ ఉన్నోళ్లను అడ్డుకోం..హెచ్1బీ వీసాపై రెండు వాదనలూ నచ్చినయ్ : ట్రంప్

టాలెంట్ ఉన్నోళ్లను అడ్డుకోం..హెచ్1బీ వీసాపై రెండు వాదనలూ నచ్చినయ్ : ట్రంప్
  • అమెరికాకు సమర్థమైన ఉద్యోగులు అవసరమని కామెంట్ 
  • ఉక్రెయిన్​పై పుతిన్ చర్చలకు రావాలి.. లేకుంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక
  • 18 వేల అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు భారత్ ఓకే 
  • ట్రంప్ 2.0 సర్కారులో భారత్​కు ప్రాధాన్యం.. ఇండియాతోనే తొలి ద్వైపాక్షిక సమావేశం
  • బర్త్ రైట్ సిటిజన్​షిప్ రద్దుపై వరుసగా దావాలు 

వాషింగ్టన్ : అమెరికాకు వచ్చే టాలెంట్ ఉన్న వ్యక్తులను అడ్డుకోబోమని ఆ దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తమ దేశానికి మంచి సామర్థ్యం గల ఉద్యోగుల అవసరం ఉందన్నారు. హెచ్1బీ వీసా అంశంపై ఆయన మంగళవారం వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు. టెక్ ఇండస్ట్రీతోపాటు ఇతర రంగాల్లోని ఉద్యోగాలకూ నిపుణులు కావాలన్నారు. అమెరికన్ కంపెనీలు విదేశాల నుంచి తెచ్చుకునే స్కిల్డ్ వర్కర్లకు ఇచ్చే హెచ్1బీ వీసాలపై ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఆయన మద్దతుదారుల్లోనే రెండు రకాల వాదనలు మొదలయ్యాయి. 

టెస్లా ఓనర్ ఎలాన్ మస్క్ వంటి వాళ్లు హైక్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ను తీసుకోవాలని వాదిస్తుండగా.. విదేశీ ఉద్యోగులను తీసుకుంటే అమెరికన్ల ఉద్యోగాలు పోతాయంటూ ఇతరులు వాదిస్తున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఈ రెండు రకాల వాదనలూ తనకు నచ్చాయని కామెంట్ చేశారు. ఒరాకిల్ సీటీవో లారీ ఎలిసన్, సాఫ్ట్ బ్యాంక్ సీఈవో మసయోషీ సన్, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్​తో కలిసి ఆయన ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘‘నాకు రెండు వాదనలూ నచ్చాయి. అలాగే దేశంలోకి చాలా సమర్థంగా పని చేసే వ్యక్తులు రావడం నాకు కూడా ఇష్టమే. టెక్ ఇండస్ట్రీలోకి మాత్రమే కాదు ఇతర రంగాల్లోకి.. 

ట్రైనింగ్, హెల్పింగ్ వంటి పాత్రలు పోషించే వారు అయినా పర్వాలేదు. నేను వాళ్లను ఆపబోను” అని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘హెచ్1బీ ప్రోగ్రాం గురించి నాకు బాగా తెలుసు. నేను కూడా దీనిని వినియోగించాను. టెకీలు మాత్రమే కాకుండా వైన్ ఎక్స్ పర్ట్ లు, హైక్వాలిటీ వెయిటర్స్ వంటి అనేక ఉద్యోగాల్లో బెస్ట్ ఎంప్లాయీస్ అవసరం ఉంది. లారీ ఎలిసన్ వంటి వారికి, నాసా వంటి సంస్థలకు బెస్ట్ ఇంజనీర్ల అవసరం అందరి కన్నా ఎక్కువగా ఉంది. అందుకే క్వాలిటీ ఉద్యోగులు రావాలి. దానివల్ల కంపెనీలు విస్తరిస్తాయి. ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతుంది” అని ఆయన తెలిపారు.

బర్త్ రైట్ సిటిజన్​షిప్ రద్దుపై 22 రాష్ట్రాల దావాలు 

అమెరికా గడ్డపై విదేశీయులకు, వలసదారులకు పుట్టే పిల్లలకు ఆ దేశ పౌరసత్వం కల్పించడాన్ని రద్దుచేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా కోర్టుల్లో వరుసగా దావాలు దాఖలవుతున్నాయి. బర్త్ రైట్ సిటిజన్షిప్​ను రద్దు చేస్తూ ట్రంప్ సోమవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం చేసిన తర్వాత లా సూట్ల దాఖలు మొదలైంది. సోమవారం అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, ఇమిగ్రెంట్ ఆర్గనైజేషన్లు కలిపి ఒక దావా వేయగా.. ప్రస్తుతం గర్భిణిగా ఉండి, వచ్చే మార్చిలో ప్రసవించాల్సి ఉన్న ఓ ఇమిగ్రెంట్ మహిళ మరో దావా వేసింది. 

మంగళవారం డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యం ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, సిటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో సహా 22 రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా బోస్టన్, సియాటెల్ లోని ఫెడరల్ కోర్టుల్లో రెండు వేర్వేరు లా సూట్లు ఫైల్ చేశాయి. వీటితోపాటు ఆయా రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా కూడా కేసులు దాఖలవుతున్నాయి. అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ట్రంప్ నిర్ణయం ఉందని, ఇది వందేండ్ల నుంచి కల్పిస్తున్న రాజ్యాంగ బద్ధమైన హక్కులను హరించడమేనని పిటిషనర్లు పేర్కొంటున్నారు. కాగా, వచ్చే నెల 19 నుంచి బర్త్ రైట్ సిటిజన్​షిప్ రద్దు ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

18 వేల ఇండియన్లు వెనక్కి.. 

అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18 వేల మంది వలసదారులను వెనక్కి తీసుకునేందుకు భారత్ అంగీకారం తెలిపింది. అక్రమ వలసదారులను గుర్తించి, స్వదేశానికి తిరిగి పంపే అంశంలో అమెరికా ప్రభుత్వానికి ఈమేరకు భారత్ సహకరిస్తోందని మంగళవారం బ్లూమ్ బర్గ్ సంస్థ ఒక నివేదికలో తెలిపింది. దీనికి సంబంధించిన డిపోర్టేషన్ ప్రక్రియను ప్రారంభించేందుకు, భారత్ కు చెందిన అక్రమ వలసదారుల వివరాలను వెరిఫై చేసేందుకు ఇండియా సిద్ధమైనట్టు పేర్కొంది. 

కాగా, అమెరికా నుంచి 2023‌‌‌‌‌‌‌‌–24లో 145 దేశాలకు చెందిన 1.60 లక్షల మంది అక్రమ ఇమిగ్రెంట్లను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం 495 విమానాల్లో వారి సొంత దేశాలకు పంపించింది. వీరిలో భారతీయులు 1,100 మంది ఉన్నారు. 2024లో దేశంలోకి ప్రవేశించిన అక్రమ వలసదారుల్లో భారతీయులు 3 శాతం వరకూ ఉన్నట్టు అంచనా. 

రెఫ్యూజీ ప్రోగ్రాం నిలిపివేతపై అఫ్గాన్ల ఆందోళన 

అమెరికాకు వివిధ దేశాల నుంచి శరణార్థులను అనుమతించే కార్యక్రమాన్ని 3 నెలల పాటు నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అఫ్గానిస్తాన్​లోని వేలాది మంది పౌరులు ఆందోళన చెందుతున్నారు. అఫ్గానిస్తాన్​లో ప్రాణాలు పణంగా పెట్టి అమెరికా బలగాలకు సాయం చేశామని, 2021లో అమెరికా బలగాలు వెళ్లిపోయి, తాలిబాన్ సర్కారు రావడంతో తాము ముప్పును ఎదుర్కొంటున్నామని వారు అంటున్నారు. అందుకే రెఫ్యూజీ ప్రోగ్రాం రద్దు ఉత్తర్వులను సడలించి.. అమెరికాలో సెటిల్ అయ్యేందుకు తమను అనుమతించాలని కోరుతున్నారు.

ఇండియాకు టాప్ ప్రయారిటీ

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వ్యవహారాల్లో భారత్ కు అత్యంత ప్రాధాన్యం లభిస్తోంది. ఇప్పటివరకూ అమెరికాలో కొత్త సర్కారు ఏర్పడినప్పుడల్లా మెక్సికో, కెనడా లేదా నాటో కూటమిలోని దేశాలతోనే తొలి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఈసారి తొలి ద్వైపాక్షిక సమావేశం భారత్​తో జరిగింది. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్​తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రమాణ స్వీకారం తర్వాత గంట సేపటికే భేటీ అయ్యారు.

 యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్​తో కలిసి ఆయన జైశంకర్ తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. అలాగే ఈ సమావేశం తర్వాత క్వాడ్ కూటమి (అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా జైశంకర్ పాల్గొన్నారు. అంతకుముందు ప్రమాణస్వీకార కార్యక్రమంలోనూ జైశంకర్​కు మొదటి వరుసలో సీటు కేటాయించడం విశేషం.

పుతిన్ చర్చలకు రాకుంటే..

ఉక్రెయిన్ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​తో చర్చించేందుకు, సమావేశమయ్యేందుకగ తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ పుతిన్ చర్చలకు రాకపోతే మాత్రం రష్యాపై ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ‘‘అసలు యుద్ధం మొదలవ్వాల్సిందే కాదు. సమర్థమైన అధ్యక్షుడు లేకపోవడం వల్లే అది జరిగింది. నేను గనక అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుద్ధం జరిగేదే కాదు” అని ఆయన మీడియాతో అన్నారు. ‘‘పుతిన్​తో నాకు గట్టి అండర్ స్టాండింగ్ ఉంది. అప్పుడు నేను ప్రెసిడెంట్​గా ఉండి ఉంటే ఉక్రెయిన్​లోకి రష్యా అడుగుపెట్టేదే కాదు. పుతిన్ తెలివైనవారు. అందుకే బైడెన్​ను పెద్దగా పట్టించుకోలేదు” అని అన్నారు.