కుస్తీని వదిలేస్తున్నా.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్

కుస్తీని వదిలేస్తున్నా.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికల్లో అతనికి పోటీగా నిలిచిన కామ‌న్‌వెల్త్ స్వర్ణ విజేత అనితా షియోరాన్ ఓటమిపాలయ్యారు. టాప్ రెజ్లర్లందరూ ఆమెకే మ‌ద్దతు ఇచ్చినప్పటికీ ఓటమి పాలవ్వటం గమనార్హం. మొత్తం 47 ఓట్లలో సంజ‌య్ సింగ్‌కు 40 ఓట్లు పోల‌య్యాయి. 

త‌మ‌ను లైంగికంగా వేధించాడని మ‌హిళా రెజ్ల‌ర్లు ఆరోపించిన బ్రిజ్ భూష‌ణ్ అనుచరుడే రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం వారిని క‌లిచివేస్తోంది. ఈ విషయంపై భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ.. తాను రెజ్లింగ్ క్రీడ‌ను వ‌దిలేస్తున్న‌ట్లు చెప్పారు. బ్రిజ్ భూష‌ణ్ కు వ్యతిరేకంగా 40 రోజుల‌ పాటు రోడ్ల‌పై ధ‌ర్నా చేప‌ట్టామ‌ని, ఆ సమయంలో త‌మ‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అండ‌గా నిలిచార‌ని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఎన్నిక‌ల్లో వారు మద్దతిచ్చిన అభ్య‌ర్థి ఓట‌మి పాలవ్వడం పట్ల ఆమె భావోద్వేగానికి లోన‌య్యారు. 

ఎన్నికల్లో బ్రిజ్ భూష‌ణ్ బిజినెస్ అనుచరుడు విజ‌యం సాధించార‌ని.. అందుకే తాను రెజ్లింగ్ క్రీడ‌ను వదిలేస్తున్న‌ట్లు సాక్షీ మాలిక్ వెల్ల‌డించారు. మీడియా స‌మావేశం నుంచి ఆమె కంటతడి పెట్టుకుంటూ బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  కాగా భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య మాజీ అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌.. తమను లైంగికంగా వేధించినట్లు మ‌హిళా రెజ్ల‌ర్లు ఆరోపించిన విష‌యం తెలిసిందే.