నస్పూర్, వెలుగు: మహిళల రక్షణ పోలీసుల బాధ్యత అని శ్రీరాంపూర్ సీఐ రమేశ్ బాబు అన్నారు. మంగళవారం ఎస్సై రాజేశ్ ఆధ్వర్యంలో స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడెంట్లకు షీ టీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళల రక్షణ, భద్రతకు పోలీస్ శాఖ నిత్యం అందుబాటులో ఉంటుందన్నారు. ఆన్లైన్ వేధింపులు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, తదితర అంశాలతోపాటు మహిళల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. వేధింపులకు గురైతే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వారితో చాటింగ్ చేయవద్దని, ఇతరులు పెట్టే మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. పోలీసులకు స్కూల్ స్టూడెంట్లు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ రాఖీలు కట్టారు.
వేధింపులకు గురైతే షీ టీమ్‌కు తెలియజేయాలి
లక్సెట్టిపేట: మహిళల రక్షణ కోసం ప్రభుత్వ షీ టీంలు ఏర్పాటు చేసిందని లక్సెట్టిపేట సీఐ ఆర్.కృష్ణ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కాలేజీలో మంగళవారం పోలీసులు డయల్ 100, షీ టీం, సైబర్ క్రైమ్ లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఎదురైనా 100కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలని, ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే షీ టీంను ఆశ్రయించాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి బ్యాంకు వివరాలు అడిగితే చెప్పొద్దని, నేరుగా బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టారు. ఎస్సై లక్ష్మణ్, కాలేజీ ప్రిన్సిపాల్ జై కిషన్ తదితరులు పాల్గొన్నారు.