ఎనిమిదేండ్ల పాలన ఇట్లున్నదని నడ్డాకు చెప్పిన

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గత నెల 27 న వరంగల్ సభకు హాజరైన సందర్భంగా ఆయన నన్ను కలిశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, వర్తమాన తెలంగాణ, భవిష్యత్ తెలంగాణ గురించి మా మధ్య చర్చ నడిచింది. ఉద్యమ ఆకాంక్షలు, ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్ర ప్రజల కోరుకుంటున్న అనేక విషయాలను ఆయనతో పంచుకున్న. స్వరాష్ట్రం కోసం విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు, మహిళలు, సకల కులాలు రోడ్డెక్కి కొట్లాడారు. రాష్ట్రమంతా పెల్లుబికిన ఉద్యమానికి తోడు పార్లమెంట్​లోనూ ఒత్తిడి పెరగడంతో స్వరాష్ట్ర కల సాకారమైంది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్​కు పరిపాలన అవకాశం లభించింది. కానీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు సార్థకత కరువైంది. ఈ ప్రాంత రాజకీయ, ఆర్థిక, సామాజిక చరిత్ర, ఇతర సంఘటనలు ప్రజల ఆకాంక్షల గురించి నడ్డాకు చెప్పిన. తెలంగాణ ప్రస్తుత పరిపాలన, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను సంక్షిప్తంగా వివరిస్తూ ఒక లిఖిత పూర్వకమైన రిపోర్టు కూడా అందజేసిన. ప్రస్తుతం ప్రతిపక్షాలకు అనువైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తమ ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చే నాయకులు, పార్టీల కోసం ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు చర్చించుకుంటున్న విషయం వాస్తవమని వారికి వివరించిన.

ఎనిమిదేండ్ల పాలన ఇట్లున్నదని చెప్పిన

రాష్ట్రం ఏర్పాటు నుంచి గత ఎనిమిది ఏండ్ల కాలంలో ప్రజలకిచ్చిన అసలు హామీలు అటకెక్కాయి. ప్రజాస్వామ్యంలో ఒక బలమైన ప్రతిపక్షం లేకుండా చేయడం ప్రజలకు మింగుడు పడని విషయంగా మారింది. ఉద్యమ ఆశయాలు నెరవేర్చకపోవడమే గాక పరిపాలనలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువలు కొరవడటం, కుటుంబ పాలనలో నిర్ణయాధికారం కేంద్రీకృతమై ఆనాటి నవాబుల పాలనను గుర్తు చేస్తున్నది. 
భూ మాఫియా పెరిగింది. పరిహారం కోసం భూ నిర్వాసితుల గోస పడుతున్నరు. రెండు పర్యాయాలు గెలిపించినా బంగారు తెలంగాణ కాదు కదా బతుకు తెలంగాణ కోసం ఎదురుచూస్తూ ప్రజలు విసిగిపోయారు. దీంతో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రతిపక్షాలవైపు చూస్తున్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను చంపవచ్చు, నాయకులను కొనవచ్చునేమో కానీ ప్రజలే ప్రతిపక్షాన్ని సృష్టించుకుంటారని చరిత్ర తెలుపుతోంది. బీజేపీ అధ్యక్షులు ఈ విషయాలన్నీ ఒక్కసారి అధ్యయనం చేసుకుని, వారు నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

వ్యతిరేకతకు గల కారణాలనూ.. 

పరిపాలనలో పారదర్శకత లేక, అర్హులకు సంక్షేమ పథకాలు అందక, విద్య, వైద్య రంగాలు నిర్వీర్యమై, నిరుద్యోగం విపరీతంగా పెరిగి ప్రస్తుత పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి మొదలైన విషయాలు, గత ఎనిమిదేండ్ల పాలన.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అమలు చేసిన నిర్బంధ పాలన, ప్రజలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు అనుభవిస్తున్న అణచివేత, వివక్ష, మితిమీరిన అవినీతి తదితర అంశాలన్నీ చర్చించాం

తెలంగాణ గడ్డ చరిత్ర..

తెలంగాణ పోరాటాల గడ్డ. గత చరిత్ర చూస్తే అణచివేతను ఇక్కడి ప్రజలు ఎన్నడూ సహించలేదు. ఆత్మగౌరవాన్ని ఎన్నడూ వదులుకోలేదు. అందుకే  దేశంలో ఇది ప్రత్యేక సామాజిక పరిస్థితులు కలిగిన ప్రాంతం. అధికార పార్టీ నియంతృత్వాన్ని ఇక్కడి ప్రజలు సహించని ఈ సందర్భాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలి. రాజకీయ ప్రజాస్వామ్య, ఆర్థిక, సామాజిక ప్రణాళికలు ప్రజల ముందు ఉంచి, వారి విశ్వాసం చూరగొనాలన్నదే నా అభిప్రాయం. అప్పుడే అధికారానికి చేరువ కావడానికి అవకాశం ఉంటుంది.  ఆదివాసీలు అణచివేతకు గురవుతున్నారు. 52 శాతం ఉన్న బీసీల్లో ఇంకా చట్ట సభలకు వెళ్లని కులాలు ఎన్నో ఉన్నాయి.  పార్టీలు చిత్తశుద్ధితో వారికి అవకాశం కల్పించాలి. నూతన సామాజిక సమీకరణతో ముందుకు వెళితే ప్రతిపక్షాలకు అధికారం హస్తగతం చేసుకోవడానికి అవకాశం మెండుగా ఉన్నది. దాన్ని అందిపుచ్చుకోవడానికి కావాల్సిన ఆచరణాత్మక వ్యూహాలు రచించుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాలు, నీటి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, రెవెన్యూ, పరిపాలన విధానాలు, పారదర్శకతలేని నవాబులను తలపించే పాలన, సాధారణ ప్రజలకు అందుబాటులో లేని పాలకులు, విచ్చలవిడి మద్యం అమ్మకాలు, ప్రభుత్వ వనరుల కారుచౌక విక్రయం, అపాత్ర దానధర్మాలు, విద్య, వైద్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న పరిస్థితులకు భిన్నంగా రాబోయే పాలన ఉండాలి.

కేంద్ర నిధులతో బాగు చేయాలని కోరిన..

తెలంగాణ మెజారిటీ ప్రజల విద్య, వైద్యం, ఉపాధి, ఆత్మగౌరవం, స్వయం పాలన తదితర అంశాలను సంపూర్ణంగా అమలు చేసే అభివృద్ధి నమూనాను ప్రజలు ఎప్పుడూ కోరుకుంటారు. కేంద్ర నిధుల ద్వారా రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న విద్య, వైద్య రంగాలలోను బలోపేతం చేయాలి. స్వరాష్ట్రం సాధించిన ఎనిమిదేండ్ల తర్వాత కూడా ఉమ్మడి రాష్ట్రం నాటి కష్టాలే ఉన్నాయి. పాలన చేతులు మారిందే తప్పితే పేదోడి బతుకు మారలేదు. హైదరాబాదులో ఉన్న బడా వ్యాపారులకు, కార్పొరేట్ సంస్థలకు, అధికారం చేజిక్కించుకున్న ముఖ్యమైన పాలకులకు మాత్రమే మేలు జరుగుతోంది. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, దేవరకొండ, భూపాలపల్లి, ములుగు, ఇల్లందు, భద్రాచలం, స్టేషన్ ఘనపూర్, జనగామ, కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ దుర్భర పరిస్థితుల్లో బతుకుబండి లాగిస్తున్నారు. 
ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి ఊసే లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలను విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి చేయడానికి కేంద్రీయ విద్యాలయాలను, మెడికల్ కాలేజీలను, హాస్పిటల్స్, ఐఐటీ, స్కిల్ డెవలప్ మెంట్ సంస్థలను నెలకొల్పి, సరిపోను నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని జేపీ నడ్డాను అభ్యర్థించిన.

సమైక్యవాదుల గురించి..

తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని, ఉద్యమకారులను అణచి వేయడానికి ప్రయత్నించిన వారిని అక్కున చేర్చుకొని కేబినెట్ లో ఉన్నత పదవులు కట్టబెట్టడం, నవ్వినోళ్ల ముందట బోర్ల పడ్డట్టుగా ఉద్యమకారులను అవమానించడం గుర్తు చేశా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ రంగంలోనైనా ఇక్కడి వాళ్లు ఎదిగివచ్చారా అనేది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలింది. ఉద్యమ పార్టీ పాలనలో ఇలాంటి పరిస్థితి దాపురిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు విలువ చేసే ప్రాజెక్టులు, వలసవాదులకు వందలాది ఎకరాల భూములను అప్పనంగా అప్పగించడం, కృష్ణానది నీళ్లలో రాష్ట్ర వాటా కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేసిన విషయాన్నీ నడ్డా దృష్టికి తీసుకువెళ్లిన. 

- కూరపాటి వెంకట నారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్, కేయూ