- ‘వెలుగు’తో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్
హైదరాబాద్, వెలుగు: ఇండియా తొలిసారి ఆతిథ్యం ఇచ్చిన చెస్ ఒలింపియాడ్‌లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ ఆకట్టుకున్నాడు. వరంగల్ కు చెందిన 18 ఏండ్ల అర్జున్ ప్రాతినిథ్యం వహించిన జట్టు నాలుగో స్థానంలో నిలవగా..వ్యక్తి గత పెర్ఫామెన్స్‌కు గాను అతను సిల్వర్ మెడల్ సాధించాడు. ఆడిన తొలి ఒలింపియాడ్ తనకు మంచి అనుభవాన్ని ఇచ్చిందని అర్జున్ అంటున్నాడు. ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్‌గా ఇకపై పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేందుకు చదువును కూడా ఆపేశానని తెలిపాడు. ఒలింపియాడ్‌లో తన ఆట.. భవిష్యత్ లక్ష్యాల గురించి అర్జున్ ‘వెలుగు’తో ముచ్చ టించాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే..
గొప్ప అనుభవం
నేను తొలిసారి చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొన్నా. అది కూడా ఆడటం గొప్ప అనుభవం. టీమ్ ఈవెంట్లలో ఇండియాకు రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. నేను 11 గేమ్స్‌లో ఒక్కదానిలో కూడా ఓడిపోకుండా 8.5 పాయింట్లతో బోర్డు–3పై సిల్వర్ గెలిచా. పర్సనల్‌గా అయితే సంతృప్తికరంగానే ఉంది. కానీ, నేను ఆడిన ఇండియా–ఎ జట్టు కూడా మెడల్ గెలిస్తే ఇంకా బాగుండేది. అది ఒక్కటే కాస్త నిరాశ కలిగిస్తోంది. ఎనిమిదో రౌండ్‌లో ఆర్మేనియా చేతిలో ఓడటం మా అవకాశాలను దెబ్బతీసింది. కనీసం డ్రా చేసుకున్నా కూడా మేం మెడల్ రేసులో నిలిచేవాళ్లం. మేం మిస్సయినా.. ఇండియా–బి మెడల్ గెలిచినందుకు హ్యాపీగా ఉంది. విమెన్స్‌లో ఇండియా–ఎ గోల్డ్ తెస్తుందని అనుకున్నాం. కానీ, ఆఖరి రౌండ్‌లో ఓడిపోతుందని ఊహించలేదు.
చాలా నేర్చుకున్నా..
చెస్‌లో టీమ్ ఈవెంట్లు తక్కువగా ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన టోర్నమెంట్. వివిధ దేశాల ప్లేయర్లంతా ఒక్క చోట కలుస్తారు. ఇండియా టీమ్‌లో ఇతర ప్లేయర్లను నేను ఇది వరకు కలిసింది తక్కువ. కాబట్టి అందరిని కలుసుకొని, ఎన్నో విషయాలు నేర్చుకునే అరుదైన అవకాశం నాకు లభించింది. నా టీమ్‌లో ఉన్న హరికృష్ణ, విదిత్‌కు ఇది వరకు ఒలింపియాడ్స్ ఆడిన అనుభవం ఉంది. దాంతో, నేను కాస్త తడబడినా.. కంగారు పడినా సపోర్ట్‌గా నిలిచారు. ఈ టోర్నీలో నాకు అంత మంచి ఆరంభం దక్కలేదు. ముఖ్యంగా రెండో రౌండ్‌లో బలహీన ప్రత్యర్థితో డ్రా చేసుకున్న తర్వాత బాధపడటంతో నా దగ్గరకి వచ్చారు. ఇలాంటివి సహజం.. మున్ముందు బాగా ఆడొచ్చని నాలో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేశారు.
2700 రేటింగ్ గురించి ఆలోచించలేదు..
ఈ టోర్నీలో మెడల్‌తో పాటు ఎలో రేటింగ్ పాయింట్లను 2700కి పెంచుకున్నా. ఈ టోర్నీకి ముందు నేను మార్చిలోనే 2675 రేటింగ్ పాయింట్లతో ఉన్నా. కాబట్టి ఏప్రిల్, మేలోనే 2700 దాటాలని బాగా ఆలోచిస్తూ ఆడేవాడిని. కానీ, అది ప్రతికూల ప్రభావం చూపెట్టింది. దాంతో, ఈ టోర్నీలో రేటింగ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా.. నా గేమ్‌పై, టీమ్‌కు ఉపయోగపడటంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టా.
అంచనాల ఒత్తిడి లేదు
ఇండియాలో ఇప్పుడు చెస్‌కు మంచి ఆదరణ లభించడం, యంగ్ గ్రాండ్ మాస్టర్ల సంఖ్య పెరగడం మంచి విషయం. యంగ్‌స్టర్స్ అయినప్పటికీ మాపై చాలా అంచనాలు ఉంటున్నాయి. నా వరకు అంచనాల భారం ఆటను ప్రభావితం చేస్తుందని అనుకోవడం లేదు. రిలాక్స్ అయ్యేందుకు సినిమాలు చూస్తుంటా. టేబుల్ టెన్నిస్ ఆడుతుంటా. చెస్‌తో పాటు నాకు టీటీ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆడుతున్నా.
రెండింటినీ బ్యాలెన్స్ చేయలేను
ఒక ప్రొఫెషనల్ చెస్ ప్లేయర్‌గా ఇకపై నేను పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. అందుకే డేటా సైన్సెస్ డిగ్రీని తొలి ఏడాదిలోనే ఆపేశా. చెస్, చదువును రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టం అనిపించింది. అందుకే చెస్‌తోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా. ఇకపై పెద్ద టోర్నీలు ఆడుతూ నా రేటింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెడతా. ముందుగా 2750 రేటింగ్ దాటాలని అనుకుంటున్నా. వరల్డ్ చాంపియన్ అవ్వడం నా అంతిమ లక్ష్యం. దాన్ని అందుకుంటానన్న నమ్మకం ఉంది. ఒలింపియాడ్ ముగియగానే వరంగల్ వచ్చి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నా. తదుపరి ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే అబుదాబి మాస్టర్స్‌లో పోటీ పడతాను. ఇది ఓపెన్ టోర్నమెంట్. పోటీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో సత్తా చాటి వీలైనంత తొందరగా 2750 రేటింగ్ పాయింట్లు అందుకోవాలని చూస్తున్నా.