పొంగులేటి ఇంటిపై ..ఐటీ రెయిడ్స్ .. ఆఫీసులు, బంధువుల ఇండ్లలోనూ సోదాలు 

  • రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 చోట్ల తనిఖీలు 
  • ఐటీ అధికారుల అదుపులో పొంగులేటి భార్య, కొడుకు, తమ్ముడు
  • నా అల్లుడు, సిబ్బందిని కొట్టిన్రు.. ఓటమి భయంతోనే దాడులు: పొంగులేటి 
  • బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశాయని ఫైర్ 
  • అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్​ దాఖలు 

ఖమ్మం, వెలుగు :  మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి​పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఇండ్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు గురువారం దాడులు చేశారు. ఖమ్మంలోని ఇల్లు, క్యాంప్ ఆఫీస్, రాఘవ కన్ స్ట్రక్షన్ ఆఫీస్, నారాయణపురంలోని ఇల్లుతో పాటు ఖమ్మంలోని బంధువుల ఇండ్లలోనూ సోదాలు జరిపారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, నందగిరిహిల్స్, వంశీరామ్ జ్యోతి హిల్ రిడ్జ్ లోని ఇండ్లు, బంజారాహిల్స్ లోని రాఘవ ప్రైడ్, బేగంపేటలోని ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 29 చోట్ల రెయిడ్స్ జరిపారు. ఖమ్మంలో గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 7 గంటలకు పూర్తయ్యాయి.

పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి భార్య మాధురి, కొడుకు హర్ష, తమ్ముడు ప్రసాద్​రెడ్డిని ఐటీ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్​కు తరలించారు. సోదాల సమయంలో కుటుంబసభ్యులు, ఇంట్లోని సిబ్బంది నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాడుల విషయం తెలియడంతో ఉదయం నుంచే ఖమ్మంలోని పొంగులేటి ఇంటికి ఆయన అభిమానులు, కాంగ్రెస్​కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తనిఖీల సమయంలో కొమ్మూరుకు చెందిన ఉపేందర్​అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్​పోసుకున్నాడు. పక్కనున్న కార్యకర్తలు వెంటనే అతన్ని అడ్డుకుని, ఒంటిపై నీళ్లు పోసి అక్కడి నుంచి తరలించారు. 

కంప్యూటర్ హార్డ్ డిస్క్​లు స్వాధీనం.. 

హైదరాబాద్​లో సోదాలు జరిపిన టైమ్ లో పొంగులేటి, ఆయన కుటుంబసభ్యులు ఖమ్మంలో ఉన్నారు. దీంతో ఇంట్లో ఉన్నోళ్లకు సమాచారమిచ్చి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పొంగులేటి కుటుంబసభ్యులు, ఆయన కంపెనీల సిబ్బంది ఇండ్లలోనూ తనిఖీలు జరిపారు. కంపెనీల సిబ్బంది ద్వారా బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించారు. ఆఫీసుల్లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు.

పొంగులేటికి చెందిన పలు కన్ స్ట్రక్షన్, అగ్రికల్చర్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు సేకరించారు. గత ఐదేండ్లుగా ఐటీ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించారు. గత రెండు నెలల వ్యవధిలో శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఆర్థిక లావాదేవీల వివరాలు సేకరించారు. కాగా, నామినేషన్ కు వెళ్లకుండా ఐటీ అధికారులు తనను అడ్డుకున్నారంటూ ఎలక్షన్​కమిషన్​కు ఆన్​లైన్​లో పొంగులేటి ఫిర్యాదు చేశారు. తన హక్కులకు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించారని, దీనిపై దర్యాప్తు జరిపించాలని ఈసీని కోరారు. 

బీజేపీలో చేరలేదనే ఇబ్బంది పెడుతున్నరు :  పొంగులేటి

ఉదయం 11గంటల సమయంలో నామినేషన్​వేసేందుకు పొంగులేటికి ఐటీ అధికారులు అనుమతి ఇచ్చారు. ఆయన భారీ ర్యాలీతో ఖమ్మం రూరల్ తహసీల్దార్ ఆఫీసుకు చేరుకుని, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నామినేషన్​దాఖలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేశాయని మండిపడ్డారు. ‘‘బీజేపీకి బీఆర్ఎస్ ​బీ టీమ్​గా వ్యవహరిస్తున్నది.

నేను బీఆర్ఎస్​ను వీడిన సమయంలో బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నరు. నిర్బంధాలు, ఐటీ దాడులతో కాంగ్రెస్ ​గెలుపును ఆపలేరు. ఐటీ అధికారులు నాపై దాడి చేస్తారని రెండ్రోజుల ముందే నేను మీడియాకు చెప్పాను” అని తెలిపారు. ఈసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అసమర్థ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. 

ఒక్క లక్ష కూడా దొర్కలే.. 

తనిఖీల సమయంలో తన కుటుంబసభ్యులు, ఆఫీస్​సిబ్బందిపై ఐటీ అధికారులు చేయిచేసుకున్నారని పొంగులేటి ఆరోపించారు. ఐటీ సోదాలు ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన అల్లుడు అర్జున్ రెడ్డితో పాటు సిబ్బందిని కొట్టారని తెలిపారు. 29 చోట్ల తనిఖీలు చేయగా, రెండు చోట్ల ముగిశాయని చెప్పారు. ‘‘నా భార్య మాధురి, కుమారుడు హర్ష, తమ్ముడు ప్రసాద్​రెడ్డిని అధికారులు వెంట తీసుకెళ్లారు. మొదట నన్ను కూడా రమ్మన్నారు.

ఆ తర్వాత ప్రచారానికి వెళ్లొద్దంటూ కండీషన్​పెట్టి.. వాళ్ల ముగ్గురిని, డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లారు. నారాయణపురంలో నా తల్లి ఉంటోంది. ఆమె వయసు 83 ఏండ్లు. అక్కడికి కూడా వెళ్లి ఐటీ అధికారులు బీభత్సం చేశారు. ఉదయం 5 గంటల నుంచి బందిపోట్ల లాగా వచ్చి పడినా సోదాల్లో లక్ష రూపాయలు కూడా పట్టుకోలేకపోయారు. ఎన్నికల సమయంలో మానసికంగా నన్ను డిస్టర్బ్ చేయాలనే ఈ కుట్ర చేశారు” అని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండి వేల కోట్లు ఖర్చు చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ నేతలపై ఐటీ దాడులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. దీనికి 23 రోజుల తర్వాత మూల్యం చెల్లించుకుంటారని అన్నారు.