దాయాదుల పోరు ముగిసి 5 రోజులు పూర్తి కావొస్తున్నా.. ఆ వేడి మాత్రం ఇంకా చల్లారడం లేదు. ఓటమి బాధలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు.. కొత్త విషయాలను తెర మీదకు తెచ్చారు. అహ్మదాబాద్ వేదికగా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా వికెట్ కీపర్ రిజ్వాన్ పట్ల భారత అభిమానులు అనుచితంగా ప్రవర్తించారంటూ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఫిర్యాదుపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక సమూహంగా అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని తేల్చి చెప్పింది. తాజాగా ఈ వ్యవహారంపై భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు.
నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు దాదాపు లక్షా 30వేల మంది అభిమానులు హాజరయ్యారు. వీరందరూ భారత అభిమానులే. వీసాలు మంజూరు చేయకపోవడంతో.. పాక్ క్రికెట్ అభిమానులు ఎవ్వరూ హాజరవ్వలేదు. ఈ మ్యాచ్‌లో ఒకానొక సమయంలో ఫ్యాన్స్.. పాక్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యంగా రిజ్వాన్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతుండగా జై శ్రీ రామ్ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. అందుకు కారణం.. అతడు మైదానంలో నమాజ్ చేయడమే.
Thousands of people raised slogans of 'Jai Shri Ram' at the Narendra Modi cricket stadium in Ahmedabad during the IND vs Pak cricket match#ICCworldCup2023 pic.twitter.com/JmDLZC9Zzn
— Organiser Weekly (@eOrganiser) October 14, 2023
ఈ వ్యవహారంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇండియా- బంగ్లాదేశ్ మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించిన పఠాన్.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు పెషావర్‌లో కొందరు అభిమానులు తనపైకి ఇనుప మొలలు(మేకులు) విసిరినట్లు వెల్లడించాడు.
"పాకిస్తాన్ పర్యటనలో భాగంగా మేము పెషావర్‌లో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. అప్పుడు నేను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా ఓ అభిమాని నాపైకి మొల విసిరాడు. అది నా కన్ను కింద బలంగా తగిలింది. ఆ ఘటన వల్ల మ్యాచ్ దాదాపు 10 నిమిషాల పాటు ఆగిపోయింది. అయినా ఆ విషయాన్ని మేం పెద్దగా పట్టించుకోలేదు. అక్కడితోనే వదిలేశాం. నేను ఈ విషయం ఇప్పుడు చెప్పేవాడిని కాదు. ఆట అన్నాక అభిమానులు రావడం.. ఇలాంటివి జరగడం కామన్. జరుగుతూనే ఉంటాయి. జరిగిపోయిన విషయాల గురుంచి వదిలేయడం మంచిది.. " అని ఇర్ఫాన్ వ్యాఖ్యానించాడు.