సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మార్పుపై గతంలో మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు. బీజేపీ నేతలు పిలుస్తున్నారు కానీ..నేనే ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కేసీఆర్ను ఓడించే పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. అమిత్ షాను కలిసింది నిజమేనని.. త్వరలోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా అన్నారు. నా నియోజకవర్గానికి డెవలప్మెంట్ నిధులు రాకుండా టీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారంటూ గతంలోనూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ను ఓడించే పార్టీలో ఉంటానని చెప్పారు. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ కు తీవ్రమైన నష్టమే జరుగుతుందని విశ్వసనీయ సమాచారం.