తగ్గేదే..లే! పుష్ప డైలాగ్​తో బీజేపీకి ఖర్గే వార్నింగ్

తగ్గేదే..లే! పుష్ప డైలాగ్​తో బీజేపీకి ఖర్గే వార్నింగ్

వక్ఫ్‌‌‌‌‌‌‌‌ బోర్డు భూములను కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ తనపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు అనురాగ్ ఠాకూర్ ప్రయత్నిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. పుష్ప సినిమాలోని ‘ఝుకేగా నై’ అనే డైలాగ్​తో వార్నింగ్ ఇచ్చారు. ‘‘నేను, లేదంటే నా పిల్లలు వక్ఫ్ బోర్డు భూములను కబ్జా చేశారని నిరూపిస్తే నేను అన్ని పదవులకు రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే ఠాకూర్ రాజీనామా చేస్తారా? లోక్​సభలో బుధవారం ఆయన నాపై అసత్య, నిరాధార ఆరోపణలు చేశారు. 

మా పార్టీ ఎంపీలు ప్రశ్నించడంతో ఆ కామెంట్లను ఆయన వెనక్కి తీసుకున్నారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియా, న్యూస్ చానెల్స్​లో అనురాగ్ ఠాకూర్ చేసిన ఆరోపణలే వైరల్‌‌‌‌‌‌‌‌ అవుతున్నాయి. అందుకే నేను నిలబడి ఆయన ఆరోపణలను ఖండించాల్సి వస్తున్నది. ఆయన కామెంట్లకు గానూ సభాపక్ష నేత జేపీ నడ్డా కూడా క్షమాపణలు చెప్పాలి. ఇలాంటి రాజకీయ దాడులతో బీజేపీ నన్ను భయపెట్టాలని చూస్తున్నది. 

అందరూ గుర్తుంచుకోండి.. నేను ఎవరికీ భయపడను.. తలొగ్గను (ఝుకేగా నై). నా జీవితం తెరిచిన పుస్తకం. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్న. ప్రజా జీవితంలో తలెత్తుకొని నిలబడ్డా. అలాంటి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు’’అని ఖర్గే అన్నారు. బీజేపీ లీడర్లు తనను భయపెట్టి లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. 

అనురాగ్ ఠాకూర్ ఏమన్నారు?

వక్ఫ్​బోర్డు బిల్లుపై చర్చ సందర్భంగా బుధవారం లోక్​సభలో ఖర్గేపై అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘వక్ఫ్ బోర్డు అనేది అవినీతి కేంద్రంగా మారింది. కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకించడానికి ఓ ప్రధానమైన కారణం ఉన్నది. కాంగ్రెస్ లీడర్లంతా వక్ఫ్ భూములను కబ్జా చేశారు. ఇప్పుడు అవి ఎక్కడ బయటపడ్తాయో అని భయపడ్తున్నారు. కర్నాటకలో వక్ఫ్ భూముల కుంభకోణంలో ఖర్గే ప్రమేయం ఉన్నది’’అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.