ఇస్లామాబాద్: పాకిస్తాన్ కొత్త ప్రెసిడెంట్ ఆసీఫ్ అలీ జర్దారీ తన పదవి కాలంలో జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. పాక్ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ట్వీట్ చేసింది. ప్రెసిడెంట్ ఆర్థిక నిర్వహణను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారని తెలిపింది. ప్రెసిడెంట్ కార్యాలయం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘దేశ ఖజానాపై తన జీతం భారంగా మారకూడదని ప్రెసిడెంట్ అనుకొన్నారు. అందుకే ఆయన జీతం తీసుకోకూడదని నిర్ణయించుకొన్నారు’’ అని పేర్కొంది. మరోవైపు పాక్ ఇంటీరియర్ మినిస్టర్ మొహసిన్ నక్వీ కూడా జర్దారీ బాటలో నడవాలని నిర్ణయించుకొన్నారు. తన పదవీ కాలంలో జీతాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ మేరకు జర్దారీ ట్వీట్ చేశారు.